![]() |
![]() |

ఎప్పుడు ఎవరు కొత్త స్టార్ గా అవతరిస్తారో, ఎప్పుడు ఏ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందో ఊహించడం కష్టం. అలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ అంటే స్టార్ల సినిమాలు, వాటి రికార్డుల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ ఒక్కోసారి స్టార్లు లేని సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చి చరిత్ర సృష్టిస్తాయి. సరికొత్త స్టార్స్ ని పుట్టిస్తాయి. 2009 సంక్రాంతికి 'అరుంధతి' అలాంటి సంచలనాలు సృష్టిస్తే.. సరిగ్గా 15 ఏళ్లకు ఇప్పుడు 2024 సంక్రాంతికి 'హనుమాన్' కూడా ఆ స్థాయి సంచలనాలు సృష్టించింది.
అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అరుంధతి'. అప్పటికి అనుష్క స్టార్ హీరోయిన్ కాదు. అప్పుడప్పుడే స్టార్స్ పక్కన నటిస్తూ గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటోంది. అలాంటి అనుష్కతో ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తీశారు కోడి రామకృష్ణ. పైగా తెలుగులో అరుదుగా వచ్చే హారర్ ఫాంటసీ జానర్. కోడి రామకృష్ణ చాలా సీనియర్ దర్శకుడు.. అప్పటికే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు, గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలు తీసి ఉన్నారు. అయితే 2009 నాటి పరిస్థితి వేరు. అప్పుడు కమర్షియల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అలాంటి సమయంలో మంచి బడ్జెట్ తో, హారర్ జానర్ లో ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తీయడం అంటే రిస్క్ తో కూడుకున్నది. అలాంటి రిస్క్ తీసుకున్నారు కాబట్టే రిజల్ట్ కూడా అదే రేంజ్ లో వచ్చింది. 2009 సంక్రాంతి కానుకగా జనవరి 16న విడుదలైన అరుంధతి.. ఊహించని సంచలనాలు సృష్టించింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాతో అనుష్క స్టార్డం ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది.
'అరుంధతి' వచ్చిన 15 ఏళ్లకు.. ఈ సంక్రాంతికి వచ్చిన 'హనుమాన్'(Hanuman) కూడా ఆ స్థాయి సంచలనాలు సృష్టిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు పరిచయమున్న తేజ సజ్జ హీరో. మూడు సినిమాల అనుభవం ఉన్న ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఇది మైథలాజికల్ టచ్ ఉన్న సూపర్ హీరో కాన్సెప్ట్ ఫిల్మ్ అయినప్పటికీ.. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ చాలామంది 'హనుమాన్'ని తక్కువ అంచనా వేశారు. అయితే హనుమాన్ ఆ అంచనాలను తలకిందులు చేసి సంచలనాలు సృష్టిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం రెండు వారాలు కూడా పూర్తి కాకముందే.. రూ.225 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి రూ.250 కోట్ల దిశగా దూసుకుపోతోంది. అంతేకాదు టాలీవుడ్ టాప్-10 గ్రాసర్స్ లో ఒకటిగా నిలవనుంది. ఈ స్థాయి వసూళ్లు ఇప్పటిదాకా కొందరు స్టార్లకు కూడా సాధ్యం కాలేదు. అలాంటిది కుర్ర హీరో తేజ సజ్జ నటించిన 'హనుమాన్' సినిమా.. రికార్డు వసూళ్లు రాబట్టడమే కాకుండా అతన్ని స్టార్ గా మలిచింది.
![]() |
![]() |