![]() |
![]() |
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత థియేటర్ల కలెక్షన్లపై వాటి ప్రభావం పడిన విషయం తెలిసిందే. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే సినిమాలు చూసేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దాంతో ఓటీటీ సంస్థల మధ్య పోటీ కూడా బాగా పెరిగింది. ఎవరికి వారు క్వాలిటీ కంటెంట్ ఇచ్చేందుకు సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు కూడా ఓటీటీ సంస్థలు ఉన్నాయి. కానీ, లాక్‌డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూత పడడంతో ఓటీటీ సంస్థల పంట పండిరది. ఇదే అదనుగా భావించిన ఆ సంస్థలు తమ సబ్‌స్క్రైబర్స్‌ను విపరీతంగా పెంచుకున్నాయి. దీంతో ఓటీటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. తమకు నచ్చిన సినిమాలను, వెబ్ సిరీస్‌లను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసే అవకాశం ఉండడంతో ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది.
ప్రస్తుతం లెక్కకు మించి ఓటీటీ సంస్థలు ఉన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకత వేరు. అన్ని భాషల్లోని భారీ చిత్రాలను ఎక్కువగా కొనుగోలు చేసేది నెట్‌ఫ్లిక్స్ సంస్థే. ఇప్పటికే టాలీవుడ్‌లోని భారీ సినిమాలను చాలా వరకు దక్కించుకుంది. ఇటీవల తమ సంస్థ కొనుగోలు చేసిన సినిమాల వివరాలను ప్రకటించింది. అందులో దేవర, పుష్ప2 వంటి సినిమాలు కూడా వున్నాయి. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరమే రిలీజ్ కాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ సంస్థకు ఉన్న సబ్‌స్క్రైబర్స్ ఎంతమందో తెలిస్తే అందరూ షాక్ అవ్వక తప్పదు. 2023 ఆరంభంలో లెక్కల ప్రకారం 240 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఆ సంస్థకు ఉన్నట్టు తెలిసింది. 2023 చివరలో ఆ సంఖ్య 260 మిలియన్‌కి చేరింది. అంటే దాదాపు 26 కోట్ల సబ్‌స్క్రైబర్స్ నెట్‌ఫ్లిక్స్ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఓటీటీ సంస్థలతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు ఎక్కువే. అయినా అంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.
![]() |
![]() |