![]() |
![]() |

తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్'(Game Changer)ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రామ్ చరణ్(Ram Charan).. 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. శంకర్ 'ఇండియన్-2'తో బిజీ కావడంతో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. ఈ వేసవిలో 'ఇండియన్-2'ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత శంకర్ తన పూర్తి దృష్టిని 'గేమ్ ఛేంజర్'పై పెట్టె అవకాశముంది. అయితే ఈలోపు బుచ్చిబాబు ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు చరణ్.
'RC16' మూవీ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్ర చరణ్ కి ఎంత పేరు తీసుకువచ్చిందో.. అంతకుమించిన పేరు తెచ్చేలా హీరో పాత్రని డిజైన్ చేశాడట దర్శకుడు బుచ్చిబాబు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, షూటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరుగున్నాయని తెలుస్తోంది. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
మొన్నటివరకు 'గేమ్ ఛేంజర్' ఆలస్యమవుతుండటం, 'RC 16' స్టార్ట్ కాకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు మార్చి నుంచి 'RC 16' స్టార్ట్ కానుండంతో పాటు, 'గేమ్ ఛేంజర్' కూడా వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదలయ్యే అవకాశముందని వార్తలు వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
![]() |
![]() |