![]() |
![]() |
దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హీరో విజయకాంత్. అయితే విచిత్రం ఏమిటంటే అతను తమిళ్లో తప్ప మరో భాషలో సినిమా చెయ్యలేదు. కేవలం ఆయన నటించిన సినిమాలు వివిధ భాషల్లో డబ్ అవ్వడం ద్వారా ఆయా భాషల్లో కూడా క్రేజ్ సంపాదించుకున్నారు. తన మాతృభాషలో తప్ప మరో భాషలో సినిమా చెయ్యని ఏకైక హీరోగా విజయకాంత్‌ని చెప్పుకోవాలి. అయితే విజయకాంత్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయి ఘన విజయం సాధించాయి. తమిళ్ తర్వాత విజయకాంత్‌కి ఎక్కువ పాపులారిటీ వచ్చింది తెలుగులోనే. తమిళ్లో సూపర్‌హిట్ అయిన పలు సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. అతని సినిమా తెలుగులో వస్తోందంటే దానికోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడేవారు. ఎందుకంటే అతని సినిమాలు తెలుగులో సూపర్‌హిట్ కూడా సూపర్‌హిట్ అయ్యేవి. అలా కాకపోయినా మినిమం గ్యారెంటీతో రన్ అయ్యేవి. 90వ దశకంలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో విజయకాంత్ డబ్బింగ్ సినిమాలు పోటీపడేవి అంటే తెలుగులో అతనికి ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ భాషల్లో విజయకాంత్‌కి పేరు రావడానికి ముఖ్య కారణం అతను చేసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్‌తోనే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు విజయకాంత్.
తెలుగులో డబ్ అయిన విజయకాంత్ సినిమాల్లో పోలీస్ అధికారి, కెప్టెన్ ప్రభాకర్, సింధూర పువ్వు, నూరవ రోజు, క్షత్రియుడు వంటి సినిమాలు అతనికి మంచి ఫాలోయింగ్ తెచ్చాయి. దాంతో విజయకాంత్ మార్కెట్ డబుల్ అయ్యింది. హిందీలోకి ఆయన సినిమాలు డబ్ అయ్యేవి. బి, సి సెంటర్లలో ఆయన సినిమాలకు ప్రత్యేక మార్కెట్ ఉండేది. విలేజ్ బేసెడ్ మాస్ సినిమాలకు ఒక దశలో విజయకాంత్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.
తెలుగులో రీమేక్ అయిన విజయకాంత్ సినిమాల గురించి చెప్పుకోవాల్సి వస్తే.. ‘సట్టం ఓరు ఇరుట్టరాయ్’ చిత్రం తెలుగులో ‘చట్టానికి కళ్ళు లేవు’ పేరుతో రీమేక్ అయ్యింది. కన్నడ చిత్రం ‘గెలువు నన్నదే’ ఆధారంగా తమిళ్లో ‘వెట్రి’ రీమేక్ అయింది. దాని ఆధారంగా ‘దేవాంతకుడు’ రీమేక్ అయింది. ఈ రెండు సినిమాల్లోనూ చిరంజీవి హీరో కావడం విశేషం. ‘వైదేకి కాతిరంతల్’ మూవీని తెలుగులో ‘మంచి మనసులు’ పేరుతో రీమేక్ చేశారు. ‘నానే రాజా నానే మంతిరి’ చిత్రాన్ని తెలుగులో ‘నేనే రాజు నేనే మంత్రి’ పేరుతో 1987లో రీమేక్ చేశారు. ఇక ‘అమ్మన్ కోయిల్ కిజక్కలే’ చిత్రాన్ని చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 786’ పేరుతో రీమేక్ చేశారు. 1987లో వచ్చిన ‘నినైవే ఓరు సంగీతం’ సినిమాను తెలుగులో ‘దొంగ పెళ్లి’ అనే టైటిల్‌తో 1988లో రిలీజ్ చేశారు ఇందులో శోభన్‌బాబు హీరోగా నటించారు. 1989లో వచ్చిన ‘ఎన్ పరుషన్ తాన్ ఎనక్కు మట్టుమ్తాన్’ చిత్రాన్ని అదే ఏడాది ‘నా మొగుడు నాకే సొంతం’ పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో హీరోగా మోహన్‌బాబు నటించారు. 1992లో ‘చిన్నగౌండర్’ చిత్రాన్ని అదే సంవత్సరం ‘చినరాయుడు’గా వెంకటేష్‌తో రీమేక్ చేశారు. 2000 సంవత్సరంలో ‘వనతైపోళ’ అనే చిత్రాన్ని తెలుగులో అదే ఏడాది ‘మా అన్నయ్య’ పేరుతో రీమేక్ చేయడం జరిగింది ఇందులో హీరో రాజశేఖర్ హీరోగా నటించారు. 2002లో ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘రమణ’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో ‘ఠాగూర్’గా రీమేక్ చేశారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. 2004లో వచ్చిన ‘యంగ్ అన్న’ చిత్రాన్ని ‘ఖుషీఖుషీగా’ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో జగపతిబాబు హీరోగా నటించారు. విజయకాంత్ సినిమాలు తెలుగులోకి డబ్ అవ్వడమే కాదు, లెక్కకు మించిన సినిమాలు రీమేక్ అయ్యాయి. దీన్నిబట్టి విజయకాంత్ సక్సెస్ రేట్ ఏ రేంజ్లో ఉండేదో అర్థమవుతుంది.
![]() |
![]() |