![]() |
![]() |

ఒక్కోసారి పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తాయి. ఈ ఏడాది అలా పెద్ద విజయాలను సాధించిన చిన్న సినిమాలు పలు ఉన్నాయి. వాటిలో 'బలగం', 'బేబీ', 'మ్యాడ్' సినిమాలు ముందు వరుసలో నిలుస్తాయి.
బలగం:
కమెడియన్ వేణు ఎల్దండిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం బలగం. ఈ సినిమా కోసం వేణు, తెలంగాణ పల్లె మట్టి నుంచి పుట్టిన కుటుంబ కథను ఎంచుకున్నాడు. చావు చుట్టూ కథని అల్లుకున్నప్పటికీ, దానికి వినోదాన్ని జోడించి.. నవ్విస్తూనే ఏడిపిస్తూ బంధం విలువ, బలగం విలువని చాటిచెప్పాడు. కేవలం కోటి రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. మార్చి 3న విడుదలై, ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో రూ.12 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది. తెలంగాణలోని పలు పల్లెల్లో తెరలు కట్టి బలగం సినిమాని ప్రదర్శించారంటే.. ఎంతలా ఈ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకుందో అర్థం చేసుకోవచ్చు.
బేబీ:
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ముక్కోణపు ప్రేమ కథా చిత్రం 'బేబీ'. జూలై 14న విడుదలైన ఈ సినిమా యువతని విశేషంగా ఆకట్టుకుంది. రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. ఏకంగా రూ.45 కోట్ల షేర్ రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది.
మ్యాడ్:
నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా కళ్యాణ్ శంకర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం 'మ్యాడ్'. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా.. అక్టోబర్ 6న విడుదలై యూత్ ని ఎంతగానో ఆకట్టుకొని మంచి వసూళ్లతో సూపర్ హిట్ గా నిలిచింది.
![]() |
![]() |