![]() |
![]() |

లెజండరీ సింగర్ ఎస్. జానకి ఇక లేరంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగడంతో, ఆమె ఆరోగ్యంగా ఉన్నారంటూ జానకి కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగిందని వారు చెప్పారు. జానకి మృతి చెందారంటూ వదంతులు రావడం ఇదే మొదటిసారి కాదు. ఆమె మృతి వార్త ప్రచారంపై గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మరో సీనియర్ సింగర్ మనో ఆవేదన చెందారు. అలాంటి రూమర్స్‌ను వ్యాప్తి చెయ్యవద్దని వారు ప్రజలను వేడుకున్నారు.
"జానకి అమ్మతో ఇప్పుడే మాట్లాడాను. ఆమె మైసూరులో ఉన్నారు. ఆమె కులాసాగా, ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి వదంతులను వ్యాప్తి చెయ్యకండి" అంటూ మనో ట్వీట్ చేశారు.
జానకితో చిరకాల అనుబంధం ఉన్న ఎస్పీ బాలు అయితే ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలని అభ్యర్థించారు. ఆ మహాగాయనితో తాను మాట్లాడాననీ, ఆమె బాగానే ఉన్నారనీ ఆయన తెలిపారు. "పొద్దుట్నుంచీ జానకి అమ్మ ఆరోగ్యం గురించి నాకు ఇరవై దాకా కాల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలోనో, మరో చోటో ఆమె ఇక లేరంటూ ఎవరో చెప్పారు. ఎంత దారుణం? ఆమెతో మాట్లాడాను, ఆమె చాలా బాగున్నారు. కొంతమంది కళాకారులను జనం అమితంగా ప్రేమిస్తారు. ఇలాంటి వార్తలు వింటే వాళ్లు హార్ట్ ఎటాక్‌కు గురవుతారు. సోషల్ మీడియాను మంచి కోసం వాడండి. ఇలాంటి విషయాలతో హాస్యం చెయ్యకండి. తప్పుడు విషయాల కోసం సోషల్ మీడియాను వాడకండి. జానకి అమ్మ చిరకాలం జీవిస్తారు. ఆమె క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు" అని చెప్పారు బాలు.
![]() |
![]() |