![]() |
![]() |

'పెళ్లి చూపులు'తో దర్శకుడిగా పరిచయమై, తర్వాత 'ఈ నగరానికి ఏమైంది?' తీసిన తరుణ్ భాస్కర్ గుర్తు ఉన్నాడు కదా? 'ఫలక్‌నుమా దాస్'లో పోలీస్‌గా, విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా'లో హీరోగా నటించాడు. అతడిని సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. విపరీతంగా ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తరుణ్ భాస్కర్ చేసిన ఒక పోస్ట్.
మలయాళంలో వచ్చిన 'కప్పెళ' సినిమా తరుణ్ భాస్కర్‌కి నచ్చింది. ఆ సినిమాను పొగుడుతూ పోస్ట్ పెడితే ప్రాబ్లమ్ లేదు. ఇతర సినిమాలను ఇన్‌డైరెక్ట్‌గా క్రిటిసైజ్ చేస్తున్నట్టు పోస్ట్ ఉండటంతో ప్రాబ్లమ్ వచ్చింది. "ఈ సినిమాలో హీరో పిచ్చోడిలా గట్టిగా అరవడు. డైలాగుల్లో సామెతలు చెప్పడు. స్లో మోషన్ ఫైట్స్ ఉండవు. ప్రతి రెండు నిమిషాలకు హీరో ఎంట్రీ ఉండదు. క్లైమాక్స్ లో రైతుల గురించో, సైనికుల గురించో, ఇండియా గురించో సందేశాలు లేవు. దీన్ని ఆ ఊరిలో సినిమా అంటారు మరి" అని తరుణ్ భాస్కర్ పోస్ట్ చేశాడు.
రైతుల నేపథ్యంలో గురించి సందేశాత్మక సినిమా 'మహర్షి' చేశాడు మహేష్. అందులో సందేశం ఇచ్చాడు. 'సరిలేరు నీకెవ్వరు'లో సైనికుల గురించి, అంతకు ముందు 'భరత్ అనే నేను'లో రాజకీయాలు, దేశం గురించి సందేశాలు ఇచ్చాడు. దాంతో మహేష్ బాబును తరుణ్ భాస్కర్ విమర్శించడని అతడి అభిమానులు ఫీల్ అయ్యారు. దాంతో తరుణ్ భాస్కర్‌ని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు. మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా అతడిని తిట్టారు. అయితే, మహేష్ ఫ్యాన్స్ ఎక్కువ హర్ట్ అయినట్టు ట్రోల్స్ చూస్తే తెలుస్తోంది.
తనను తిడుతూ చేస్తున్న పోస్టులపై తరుణ్ భాస్కర్ మరో పోస్ట్ చేశాడు. ట్రోలింగ్ చేసే నెటిజన్స్ ను కుక్కలతో పోల్చాడు. మొరుగుతున్నాయని అన్నాడు. ఫొటోలు పెట్టుకోకుండా ఫేక్ ఐడీలతో ట్రోల్ చేస్తున్నారని విమర్శించాడు. దాంతో ప్రేక్షకులకు మరింత కోపం వచ్చింది. ఇంకా ట్రోలింగ్ ఎక్కువ చేశారు. ఈ గొడవ ఎప్పటికి సద్దుమణుగుతుందో?
![]() |
![]() |