![]() |
![]() |

ఎన్నో అంచనాలు, ఆశలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన 'సర్కారు వారి పాట'. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించగా, పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. మహేశ్ ఫ్యాన్స్ మెచ్చిన ఈ సినిమా మిగతావారికి ఏమంతగా రుచించడం లేదని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. వందల, వేల కోట్లు అప్పులు తీసుకొని ఎగ్గొట్టే బడా బాబులను ఏమీ చేయలేని బ్యాంకులు పేదలు, మధ్యతరగతి వారి నుంచి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలుచేయడం, రికవరీ పేరిట వారిని వేధిస్తూ వారి కొండొకచో వారి ఆత్మహత్యలకు కూడా కారణమవుతున్నాయనే సీరియస్ సోషల్ ఇష్యూను తీసుకొని కూడా దాన్ని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు పరశురామ్ ఫెయిల్ అయ్యాడనేది విమర్శకుల మాట.
విడుదలకు ముందు వచ్చిన హైప్ కారణంగా ఫస్ట్ డే గొప్ప స్థాయిలో కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర నెమ్మదిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు ప్రత్యక్షమవుతుందనే ఆరాలు కూడా తీస్తున్నారు జనం. సినిమా బాగుందంటే వెంటనే థియేటర్‌కు వెళ్లి చూడాలనుకుంటారు. అదే ఓ మోస్తరుగా ఉందనో, ఏమంత బాగా లేదనో టాక్ వస్తే మాత్రం ఓటీటీలో వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని చూసుకుందాంలే అనుకుంటారు.
'సర్కారు వారి పాట' మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ మొదటి, లేదా రెండో వారంలో స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నది. సముద్రకని విలన్‌గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, నదియా, రవిప్రకాశ్ తదితరులు ఇతర పాత్రధారులు. తమన్ సంగీతం సమకూర్చగా, ఆర్. మది సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశాడు.
![]() |
![]() |