![]() |
![]() |

శుక్రవారం రాత్రి వినాయక చవితి పండగపూట హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు. స్పృహతప్పి పడిపోయిన ఆయనను అంబులెన్స్‌లో మొదట హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించి, అత్యవసర చికిత్స అందించారు. అప్పుడే ఆయన తలలోపల ఎలాంటి గాయాలు కాలేదని, క్లావికల్ (కాలర్) బోన్ విరిగిందనీ తేలింది. మేనల్లుడు యాక్సిండెంట్‌కు గురై, హాస్పిటల్‌లో ఉన్నాడని కబురందిన వెంటనే హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకున్న పవన్ కల్యాణ్ అతని ఆరోగ్య స్థితి గురించి ఆరా తీశారు. మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్స్‌కు తరలించారు. అక్కడి వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తూ నిరంతర వైద్య పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ వస్తున్నారు.
శనివారం ఉదయాన్నే అపోలో హాస్పిటల్స్ సాయితేజ్ ఆరోగ్య స్థితిపై ఒక బులెటిన్‌ను వెలువరించింది. "సాయిధరమ్ తేజ్ ఆరోగ్య స్థితి నిలకడగా ఉంది. ఆయన శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ సరిగ్గానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో శ్వాసను అందిస్తూ వస్తున్నాం. నిరంతరం సన్నిహితంగా ఆయన ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఈరోజు అదనంగా మరిన్ని పరీక్షలు చేయనున్నాం. ఆయన ఆరోగ్య స్థితి గురించి తదుపరి బులెటిన్‌ను రేపు వెలువరిస్తాం." అని ఆ బులెటిన్‌లో వెల్లడించింది.
సాయితేజ్ ప్రస్తుతం దేవా కట్టా డైరెక్షన్‌లో 'రిపబ్లిక్' మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయి, విడుదలకు రెడీ అవుతోంది.
![]() |
![]() |