![]() |
![]() |

2020 సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్‌ను సాధించాడు మహేశ్. ఆ సినిమా తర్వాత ఉద్దేశపూర్వకంగా మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. సినిమాకీ సినిమాకీ మధ్య కొంత కాలం ఫ్యామిలీతో గడపాలని అతను పెట్టుకున్న నియమం అది. ఆ తర్వాత పరశురామ్ డైరెక్షన్‌లో సినిమా షూటింగ్ ప్రారంభించాలని అతను ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఊహించని విధంగా కరోనా మహమ్మారి వచ్చి ఇండస్ట్రీలోని మిగతా వాళ్లందరి ప్లాన్స్‌తో పాటు అతడి ప్లాన్‌నూ భగ్నం చేసింది. ఏదేమైనా తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా పరశురామ్‌తో తను చేయబోయే సినిమా టైటిల్‌ను 'సర్కారు వారి పాట'గా అతను అనౌన్స్ చేశాడు. దాంతో పాటు ఆ మూవీలో తన లుక్ ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించాడు.
ఇప్పటికి మహేశ్ షూటింగ్‌కు దూరమై ఆరు నెలలు గడిచిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండూ షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేశాయి. అయినా డైరెక్టర్ రవిబాబు మినహా ఎవరూ సెట్స్‌పైకి వెళ్లడానికి ధైర్యం చేయట్లేదు. కారణం.. కోవిడ్ 19 కేసులు అంతకంతకూ ఉధృతం అవుతుండటం. అందుకే మరికొంత కాలం వేచి చూసే ధోరణితో పెద్ద సినిమాల దర్శక నిర్మాతలున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 'సర్కారు వారి పాట' షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని సమాచారం. ఆ లెక్కన చూస్తే మహేశ్ ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకున్నట్లే. ఇదివరకు ఒకే ఒక్కసారి ఇంత గ్యాప్ తీసుకున్నాడు మహేశ్. అది. 2007లో వచ్చిన 'అతిథి' మూవీ తర్వాత. అప్పుడైతే ఏకంగా ఏడాదిన్నర పైగా విరామం తీసుకొని 'ఖలేజా' మూవీ చేశాడు. ఆ సినిమా 2010లో వచ్చింది. అంటే రెండు సినిమాల మధ్య మూడేళ్ల గ్యాప్ వచ్చింది.
'ఖలేజా' తర్వాత మళ్లీ ఇంతదాకా అతడెప్పుడూ సినిమా సినిమాకీ మధ్య ఎక్కువ విరామం తీసుకోలేదు. కొన్ని రోజులు ఫ్యామిలీతో గడిపి, తర్వాత సినిమా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అనుకోకుండా అతడికి ఎనిమిది నెలల విరామం వస్తోంది. పరిస్థితులు మామూలుగా ఉన్నట్లయితే 'సర్కారు వారి పాట'ను కూడా సంక్రాంతికే తీసుకురావాలని అతను భావించాడు. ఇప్పుడు అది వీలయ్యే అవకాశం లేదు. ఆగస్టులోనైనా షూటింగ్ మొదలైతే, 2021 సమ్మర్‌కు ఈ సినిమా విడుదలయ్యే ఛాన్సులున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో...
![]() |
![]() |