![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నెల 10న జరగనున్న ఎన్నికల్లో 'మా' అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే విషయాన్నీ పలువురు ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు మా ఎన్నికలపై స్పందించారు.
మా ఎన్నికలపై స్పందిస్తూ తాజాగా రవిబాబు ఓ వీడియో విడుదల చేశారు. లోకల్, నాన్ లోకల్ వివాదంపై తాను మాట్లాడాలనుకోవడం లేదని.. ఫలానా ప్యానల్ కు ఓటు వేయాలని కూడా తాను చెప్పాలనుకోవడం లేదని రవిబాబు అన్నారు. మన దగ్గర ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండగా.. మన దర్శకనిర్మాతలు బయట వాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని గుర్తుచేశారు. అలాగే హైదరాబాద్ సిటీలో దాదాపు 200 మంది కెమెరామెన్లు పని లేక ఖాళీగా ఉంటే.. కెమెరామెన్లుగా బయటవాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారని తెలిపారు. ఇలా సినిమాకు సంబంధించిన చాలా విభాగాల్లో మన వాళ్లకంటే బయటవాళ్లకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నటీనటుల సంక్షేమం కోసం.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం మనం ఏర్పాటు చేసుకున్న చిన్న సంస్థ 'మా'. అలాంటి ఒక చిన్న సంస్థలో పనిచేయడానికి కూడా మనలో ఒకడు పనికిరాడా? అని రవి బాబు ప్రశ్నించారు. దీనికి కూడా మనం బయట నుంచే మనుషులను తెచ్చుకోవాలా? అని అసహనం వ్యక్తం చేశారు. ఇది మన సంస్థ.. మనం నడుపుకోలేమా? మనకి చేతకాదా? ఒక్కసారి ఆలోచించండి అంటూ రవిబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. మొత్తానికి లోకల్, నాన్ లోకల్ వివాదం గురించి మాట్లాడను, ఓటు వేయమని చెప్పను అంటూనే ఇన్ డైరెక్ట్ గా రవి బాబు తన అభిప్రాయాలను బయటపెట్టారు.
![]() |
![]() |