![]() |
![]() |
.webp)
సంచలనాలకు మారు పేరుగా చెప్పుకునే రామ్‌గోపాల్‌వర్మ ఎప్పటిప్పుడు సోషల్ మీడియాలో తన ట్వీట్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూ లేదా వ్యంగ్యంగా టీట్లు పెట్టే వర్మ ఈసారి తన బాధను వెళ్ళగక్కుకుంటూ చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. ‘ఒక్కసారి వర్షం ఆగితే గొడుగు భారం అవుతుంది... ప్రయోజనాలు ఆగిపోయినప్పుడు విధేయత ముగుస్తుంది. ఇది అన్ని రాజకీయాల వెనుక వన్ లైన్ స్టోరీ’ అని ట్వీట్ చేశారు. వర్మ పెట్టిన ఈ ట్వీట్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈమధ్యకాలంలో వర్మకు రాజకీయ పార్టీల వల్ల ఏదో అన్యాయం జరిగిందనేది ఆ ట్వీట్ వల్ల తెలుస్తోంది. ఫలానా వ్యక్తిగానీ, వ్యక్తులుగానీ తనకు అన్యాయం చేశారని ట్వీట్‌లో పేర్కొనకపోయినా దాని వెనుక అతనికి అన్యాయం జరిగిపోయింది అనే అర్థం అయితే వస్తోంది. ఈ ట్వీట్ చూసిన తర్వాత అతనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా సినిమా తీసిన వర్మను ఆ పార్టీ పక్కన పెట్టిందా? అనే ప్రధానమైన ప్రశ్న అందరి మనసులోనూ ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ, వైసీపీ. గత ఎలక్షన్స్ నుంచి రామ్‌గోపాల్‌వర్మ వైసీపీని సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. 2019 ఎలక్షన్స్ ముందు ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి వార్తల్లో నిలిచాడు. తాజాగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా ఉండే ‘వ్యూహం’ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ హైకోర్టు దాన్ని నిలిపివేసింది. జనవరి 11 వరకు ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను కూడా సస్పెన్షన్‌లో ఉంచింది. ఈ సినిమా విడుదలకు మొదటి నుంచీ ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రామ్‌గోపాల్‌వర్మ పెట్టిన ట్వీట్ ఎన్నో ఊహాగానాలకు తావిస్తోంది. తను డైరెక్ట్ చేసిన సినిమా విడుదల విషయంలో అధికార పార్టీ అయిన వైసీపీ సహాయ సహకారాలు అందించడం లేదా? వై.ఎస్.జగన్ దగ్గర వర్మ ప్రాధాన్యం తగ్గిందా? తనకు అనుకూలంగా సినిమా తీయించుకొని అవసరం తీరిన తర్వాత వర్మను జగన్ పక్కన పెడుతున్నారా? వంటి సమాధానం దొరకని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అయితే వర్మ పెట్టిన ట్వీట్‌లో ‘ఇది అన్ని రాజకీయాల వెనుక వన్ లైన్ స్టోరీ’ అనే లైన్ అందర్నీ ఉద్దేశించి పెట్టిందిగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ ఈ ట్వీట్‌పై స్పందించలేదు. అవసరానికి వాడుకొని ఇప్పుడు వర్మను పక్కన పెట్టారు. అందుకే ఈ ట్వీట్ పెట్టారన్నది బయట వినిపిస్తున్న మాట.
![]() |
![]() |