![]() |
![]() |

టాలీవుడ్‌లోని సెలబ్రిటీ జంటల్లో రామ్‌చరణ్, ఉపాసన జోడీ ఒకటనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజు (జూన్ 14)తో వారి పెళ్లయి ఎనిమిదేళ్లు. అంతకంటే మునుపు ఆ ఇద్దరి మధ్యా సినిమా స్టైల్ లవ్ స్టోరీ నడిచింది. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా రామ్‌చరణ్ పరిచయమైనప్పటికీ, ఆ తర్వాత తన ప్రతిభా సామర్థ్యాలతో నేటి టాప్ స్టార్స్‌లో ఒకడిగా నిలిచాడు. రాజమౌళి డైరెక్షన్‌లో అతను హీరోగా నటించిన 'మగధీర' మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. చిరంజీవి కుటుంబ తెలుగు చిత్రసీమలోని అత్యంత ప్రముఖ కుటుంబాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. మరోవైపు ఉపాసనా కామినేని కుటుంబ నేపథ్యం సామాన్యమైంది కాదు. ఆమె తాతలు తెలంగాణలోని దొరల కుటుంబాలకు చెందినవాళ్లు. దేశంలోని ప్రఖ్యాత హాస్పిటల్ చైన్స్‌లో ఒకటైన అపోలో హాస్పిటల్స్‌కు ఆమె కుటుంబానికి చెందినవే. దాని చైర్మన్ ప్రతాప్‌రెడ్డి ఆమె తాతయ్యే. స్వయంగా ఆమె అపోలో హాస్పిటల్స్‌కు చెందిన అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.
ఇలాంటి ప్రముఖ నేపథ్యాలు కలిగిన ఆ ఇద్దరూ ఒక స్పోర్ట్స్ క్లబ్‌లో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత కలిసిన ప్రతి సందర్భంలోనూ ఇద్దరి మధ్యా ఏదో విషయంపై వాదోపవాదాలు జరుగుతూ వచ్చాయి. అంటే సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య పరిచయం గిల్లికజ్జాలతో మొదలై, ఆ తర్వాత ప్రేమగా రూపాంతరం చెందినట్లే వాళ్ల కథా నడిచింది. ఇలా ఐదేళ్లు గడిచాక తాము ప్రేమలో ఉన్నట్లు ఆ ఇద్దరూ గుర్తించారు. ప్రేమ ఊసులు చెప్పుకున్నారు, బాసలు చేసుకున్నారు. తాము పెళ్లాడాలనుకుంటున్న విషయాన్ని ఇద్దరూ తమ ఇళ్లల్లో చెప్పేశారు. ఆ ఇద్దరి మధ్యా పరిచయం సంగతి తెలుసు కాబట్టి ఇరువైపుల నుంచీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. రెండు కుటుంబాలూ పేరుపొందినవే కావడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
2011లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయం తొలిసారి బహిర్గతం చేశాడు చరణ్. దాన్ని లవ్ స్టోరీగా అతను చెప్పలేదు. తన క్లోజ్ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్నానని మాత్రమే చెప్పాడు. 2011 డిసెంబర్ 11న చరణ్, ఉపాసనల నిశ్చితార్ధం వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఆరు నెలలకు 2012 జూన్ 14న టాలీవుడ్, బాలీవుడ్, పొలిటికల్, బిజినెస్ రంగాలకు చెందిన మహామహుల సమక్షంలో అత్యంత గ్రాండ్‌గా జరిగిన వేడుకలో ఉపాసన మెడలో మూడు ముళ్లు వేశాడు చరణ్. టాలీవుడ్‌లో ఇలాంటి పెళ్లి ఈమధ్య కాలంలో చూడలేదని అంతా చెప్పుకున్నారంటే, ఎంత కన్నుల పండువగా ఆ పెళ్లి వేడుక జరిగిందో ఊహించుకోవాల్సిందే. అప్పట్నుంచీ ఐడియల్ కపుల్‌గా, ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా మెలగుతూ వస్తున్నారు ఆ ఇద్దరూ.
b.jpg)
![]() |
![]() |