![]() |
![]() |
సినిమా రంగంలో జయాపజయాలు అనేవి సర్వసాధారణం. ఒక హిట్ సినిమా పడితే ఆ వెంటనే ఓ ఫ్లాప్ సినిమా రావడం మనం చూస్తుంటాం. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. ఒక్కోసారి టైమ్ కలిసొస్తే వరసగా హిట్ సినిమాలు వస్తాయి. అయితే వరస ఫ్లాపుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హీరోలు 2023లో ముగ్గురు ఉన్నారు. వరస ఫ్లాపుల తర్వాత ముగ్గురూ భారీ విజయాలను అందుకున్నారు. వారే రజనీకాంత్, షారూక్ ఖాన్, ప్రభాస్. ఈ ముగ్గురూ టాప్ హీరోలే. భారీ ఘనవిజయాల్ని అందుకున్న హీరోలే. కానీ, ఒక్కోసారి ఎన్ని సినిమాలు చేసినా విజయం అనేది కనుచూపు మేరలో కనిపించదు. ఈ ముగ్గురి విషయంలోనూ అదే జరిగింది.
సూపర్‌స్టార్ రజినీకాంత్.. వరసగా ఎన్ని ఫ్లాప్ సినిమాలు చేసినా ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరో. 2010లో శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో’ రజనీ కెరీర్‌లో పెద్ద హిట్ సినిమా. ఆ సినిమా తర్వాత అతను హీరోగా నటించిన 10 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ, ఏదీ విజయం సాధించలేదు. ఒకటీ అరా సినిమాలు ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నాయి తప్ప సాలిడ్ హిట్ అయితే దక్కలేదు. 2023 ఆగస్ట్ 10న విడుదలైన ‘జైలర్’తో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏమిటో మరోసారి చూపించారు రజినీ. వరల్డ్‌వైడ్‌గా యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకొని ఏకంగా రూ.600 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇక బాలీవుడ్ హీరో షారూక్‌ఖాన్ తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు చేసి మంచి కమర్షియల్ హీరోగా పేరు తెచుకున్నారు. ఇతనికి కూడా చాలా గ్యాప్ తర్వాత హిట్ వచ్చింది. 2018లో ప్రయోగాత్మకంగా చేసిన ‘జీరో’ చిత్రం చేసిన షారూక్ ఆ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి దాదాపు ఐదు సంవత్సరాలు కొన్ని కారణాల వల్ల సినిమా చేయలేదు. అయితే కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినప్పటికీ లీడ్ రోల్‌లో ఒక్క సినిమా కూడా చేయలేదు. 2023 ప్రారంభంలో వచ్చిన ‘ఫఠాన్’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు షారూక్. ఈ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఇదే సంవత్సరంలో చేసిన ‘జవాన్’ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇది కూడా రూ.1000 కోట్లు కలెక్షన్ సాధించింది. ఇక డిసెంబర్ 21న విడుదలైన ‘డంకీ’ కలెక్షన్లపరంగా తన ఉనికిని చాటుకోలేకపోయింది. అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ అలరిస్తోంది.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ విషయానికి వస్తే ‘బాహుబలి’ సిరీస్‌తో అతి పెద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. బాహుబలి 1, బాహుబలి 2.. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.2,200 కోట్లు కలెక్ట్ చేసి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా మూడు సినిమాలు వచ్చాయి. అయితే అవేవీ భారీ విజయాన్ని అందుకోలేకపోయాయి. తాజాగా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్’ డిసెంబర్ 22న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృష్టిస్తూ ఇప్పటికే రూ.500 కోట్లకుపైగా వసూళ్ళు సాధించి విజయపథంలో దూసుకెళ్తోంది.
వరస పరాజయాలతో సతమతమైన ఈ ముగ్గురు హీరోలకు 2023 సంవత్సరం బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఎన్ని ఫ్లాపులు వచ్చినా తమ క్రేజ్, ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశారు ఈ ముగ్గురు మొనగాళ్ళు.
![]() |
![]() |