![]() |
![]() |

సినిమా పేరు: కరెన్సీ నగర్
తారాగణం: యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్
సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, పవన్
సినిమాటోగ్రాఫర్: సతీష్ రాజబోయిన
ఎడిటర్: కార్తిక్ కట్స్
రచన, దర్శకత్వం: వెన్నెల కుమార్ పోతేపల్లి
నిర్మాతలు: ముక్కాముల అప్పారావు, కోడూరు గోపాల కృష్ణ
బ్యానర్: ఉన్నతి ఆర్ట్స్
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023
ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు, కోడూరు గోపాల కృష్ణ నిర్మించిన చిత్రం 'కరెన్సీ నగర్'. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి నూతన దర్శకుడు వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వం వహించాడు. ఈ ఆంథాలజీ ఫిల్మ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం...
కథ:
సత్య(సుదర్శన్) కు ఐదు లక్షల రూపాయలు అవరసం అవుతాయి. దొంగతనం చేసి అయినా సరే డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒక చోట బంగారం ఉందని తెలుసుకున్న సత్య అక్కడికి వెళతాడు. అక్కడ సత్యకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. మాట్లాడే ఒక ఇనుప పెట్టెలో బంగారం ఉంటుంది, ఆ బంగారం తీసుకోవాలనే క్రమంల... ఇనుము పెట్టె సత్యతో మూడు కథలు చెబుతుంది. అందులో మొదటి కథ మానవ సంబంధాల గురించి, రెండో కథ ప్రేమ, మోసం గురించి, మూడో కథ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం అబ్బాయి చేసే తప్పులు.. ఇలా మూడు కథలు విన్న తరువాత సత్య ఏం చేశాడు ? అతను అసలు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అతనికి కావాల్సిన ఐదు లక్షలు దొరికాయా? నిజంగానే ఇనుప పెట్టె మాట్లాడిందా? వంటి విషయాలు తెలియాలంటే కరెన్సీ నగర్ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు వెన్నెల కుమార్ కి ఇది మొదటి సినిమానే అయినా చాలా బాగా తీశాడు. తాను రాసుకున్న కథను తెరమీద చక్కగా చూపించాడు. ఈ సినిమా చూస్తుంటే మన చిన్నప్పుడు చదివిన బేతాళ కథలు గుర్తుకు వస్తాయి. కానీ ఇందులోని కథలు మాత్రం కొత్తగా ఉన్నాయి. తెరపై మంచి అనుభూతిని కలిగిస్తాయి. కేశవ, చాందిని ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. మొదటి కథ "పెయిన్" లో అమ్మ క్యారెక్టర్ చిన్నది అయినా బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్ సినిమాకు మెయిన్ ప్లస్. అలాగే క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. ఇలాంటి ఆంథాలజీ ఫిలిమ్స్ తెలుగులో అరుదుగా వస్తాయనే చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు వెన్నెల కుమార్ సక్సెస్ అయ్యాడు. సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, యువ ప్రతిభ చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల తీరు:
నటీనటులు యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్, గౌతమ్ వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. చిన్న సినిమా అయినప్పటికీ మంచి టెక్నీకల్ వ్యాల్యూస్ తో ఉంది. సిద్ధార్థ్ సదాశివుని, పవన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. సతీష్ రాజబోయిన కెమెరా పనితనం బాగుంది. కార్తిక్ కట్స్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
కొత్త తరహా ప్రయత్నంగా యువ ప్రతిభ రూపొందించిన ఈ 'కరెన్సీ నగర్' ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.
![]() |
![]() |