![]() |
![]() |

జాతీయ అవార్డు గ్రహీత, గొప్ప మలయాళ తారల్లో ఒకరిగా కీర్తి ప్రతిష్ఠలు పొందిన కె.పి.ఎ.సి. లలిత కన్ను మూశారు. మలయాళంలో 500కు పైగా సినిమాల్లో నటించిన ఆమె కేరళలోని కొచ్చిలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతూనే ఈమధ్య కాలం దాకా సినిమాల్లో నటిస్తూ వచ్చారామె. కాలేయ సంబంధ వ్యాధి కారణంగా గత డిసెంబర్‌లో హాస్పిటల్ పాలయ్యారు.
అలప్పుళలో లెఫ్ట్ భావాలతో నడిచే కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్ (KPAC) అనే రంగస్థల నాటక సంస్థలో పనిచేయడం ద్వారా కెరీర్ ఆరంభించిన లలిత, 1969లో ప్రఖ్యాత దర్శకుడు కె.ఎస్. సేతుమాధవన్ రూపొందించిన 'కూట్టుకుడుంబమ్' మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
తన అసమాన నటనతో ప్రేక్షకుల, విమర్శకుల అభిమానాన్ని దండిగా సంపాదించిన ఆమె 1980, 90, 2000, 2010ల కాలం దాకా పలు విలక్షణ పాత్రల్లో రాణించి సాటిలేని మేటి నటిగా పేరుపొందారు. ఎలాంటి పాత్రనైనా ఆమె సునాయాసంగా చేయగలదని ఆమె చేసిన వివిధ రకాల సినిమాలు రుజువు చేశాయి. ఫ్యామిలీ డ్రామాల్లో కుమార్తెగా, కోడలిగా, సోదరిగా, తల్లిగా వివిధ పాత్రల్లో అద్భుత అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం పొందారు. ఆమె కామెడీ టైమింగ్ అయితే అనితరసాధ్యం.
'అమరమ్' (1990), 'శాంతమ్' (2000) సినిమాల్లో చేసిన పాత్రలకు గాను ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. కేరళ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆమె పనిచేశారు. ప్రఖ్యాత మలయాళీ దర్శకుడు భరతన్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆయన 1998లో మృతి చెందారు. ఆమె కుమారుడు సిద్ధార్థ్ నటుడు, దర్శకుడు. ఈరోజు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతికి పలువురు మలయాళ సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
![]() |
![]() |