![]() |
![]() |

రమ్య రఘుపతితో తనకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ యాక్టర్ నరేశ్ చెప్పారు. ఆమె నరేశ్‌కు మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె అయిన రమ్య రఘుపతిని ఎనిమిదేళ్ల క్రితం నరేష్ వివాహం చేసుకున్నారు. కానీ కొంత కాలంగా వీరు విడివిడిగా ఉంటున్నారు. అయితే ఆమె నరేష్ పేరుతో మోసాలకు పాల్పడిందట. ఆమె నరేష్ పేరుతో డబ్బు వసూలు చేస్తోందంటూ తాజాగా ఐదుగురు మహిళలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందూపూర్, అనంతపురం, హైదరాబాద్‌లో భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి.
ఈ అంశానికి సంబంధించి తాజాగా నరేశ్ ఓ వీడియో సందేశం ఇచ్చారు. "మూడు నెలల క్రితమే నేను పబ్లిక్ నోటీస్ ఇచ్చాను.. 'ఈమెకూ, నాకూ ఆర్థికపరంగా కానీ, ఇతరత్రా కానీ ఎలాంటి సంబంధం లేదు. అలాగే మా బంధువులకు కూడా ఆమెతో ఎలాంటి సంబంధం లేదు' అని. ప్రజలకు తెలియాలనే ఆ నోటీస్ ఇచ్చాను. మేం దూరదూరంగా ఉన్నాం. ఏం జరుగుతోందో నాకు తెలీదు. గత కొన్ని రోజులుగా మా ఇంటికి కొన్ని కార్లు రావడం, ఇంటినిండా జనాలు చేరుతుండటంతో ఏం జరుగుతోందని ఇంట్లోని పెద్దవాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇది ఆర్థికపరమైన ఇష్యూ అని అర్థమై ఈ ఇంట్లో అలాంటి కార్యకలాపాలు పెట్టుకోవద్దని నేను చెప్పాను. రెండు మూడు రోజులుగా నాకు ఫోన్లు విపరీతంగా వస్తున్నాయి. ఒక దాని తర్వాత ఒకటిగా చాలా ఫిర్యాదులు రావడంతో ఏ మేరకు నేను సపోర్ట్ ఇవ్వగలుగుతానో కనుక్కుంటానని పోలీసులకు కూడా చెప్పాను. మా లాయర్ కూడా వెళ్లారు. ఇది ఎక్కడ మునుగుతుందో, ఎక్కడ తేలుతుందో తెలీడం లేదు. మాక్కూడా అర్థం కావట్లేదు." అని ఆయన చెప్పారు.
ఎక్కడెక్కడ్నుంచో కొత్త ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పిన నరేశ్, "నేనైతే క్లియర్‌గా ఉన్నాను. ఏం జరుగుతోందో వాళ్ల కుటుంబంలోని కొంత మందికి తెలుసు కానీ, నాకూ, నా కుటుంబానికీ తెలీదు. ఇలాంటి ఆర్థికపరమైన విషయాల్లో మా కుటుంబం ఎప్పుడూ ఇన్‌వాల్వ్ కాలేదు. మాకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదు. ఎవరినీ బాధపెట్టడం మాకిష్టం లేదు. ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నా, ఈ అంశంతో నాకు ఏ రకమైన సంబంధం లేదు." అని స్పష్టం చేశారు.
![]() |
![]() |