![]() |
![]() |

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈరోజు తన మొదటి ఒరిజనల్ తెలుగు ఆంథాలజీ 'పిట్టకథలు` ట్రైలర్‌ని విడుదల చేసింది. నాలుగు కథల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి టాలీవుడ్‌కు చెందిన నలుగురు ప్రతిభావంతులైన దర్శకులు నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డిలు దర్శకత్వం వహించారు. ఈ నలుగురూ తెలంగాణ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం.
సాధారణంగా తెలుగులో చిన్న చిన్న కథలను 'పిట్టకథలు' అని పిలుస్తాం. ఈ నాలుగు కథలు నిర్దిష్ట భావాలు గల నలుగురు మహిళల గురించి చెబుతుంది. ఈ నాలుగు పాత్రలకు ప్రాణం పోయడానికి ఈషా రెబ్బా, సాన్వే మేఘన, అమలా పాల్, శృతిహాసన్ ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే అషిమా నర్వాల్, జగపతిబాబు, సత్యదేవ్, లక్ష్మీ మంచు, అశ్విన్ కాకుమాను, సంజిత్ హెగ్డే, నవీన్ కుమార్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు.
ఈ నాలుగు చిత్రాల్లో 'రాములా'కు తరుణ్ భాస్కర్, 'మీరా'కు బి.వి.నందిని రెడ్డి, 'ఎక్స్‌లైఫ్'కు నాగ్ అశ్విన్, 'పింకీ'కి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రేమ, కోరిక, వంచన, శక్తి అనే అంశాల్ని స్త్రీ దృష్టి కోణంలోంచి ఈ కథలు మనకు చూపిస్తాయి. రోనీ స్క్రూవాలాకు చెందిన RSVP మూవీస్, ఆశి దువా సారా సంస్థ ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన 'పిట్టకథలు' 190 దేశాలలో నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న ప్రీమియర్ కానున్నది.
'రాములా' అనేది ఓ సాధారణమైన అమ్మాయి అసాధారణ ప్రయాణం. టైటిల్ రోల్‌ను సాన్వే మేఘన చేసింది. నవీన్ కుమార్‌ను ప్రేమించిన ఆమె, అతను తనకు బ్రేకప్ చెప్తే ఏం చేసిందనేది ఇందులోని ప్రధానాంశం. ఆమెను ప్రభావితం చేసి, ఓ శక్తిగా మార్చే స్త్రీగా మంచు లక్ష్మి కనిపిస్తుంది.
పితృస్వామ్యం సంకెళ్లను ఛేదించడానికి ఓ సాహస మహిళ చేసే పోరాటం 'మీరా'. ఆ పాత్రను అమలా పాల్ పోషించింది. ఛాలెంజింగ్ రోల్‌లో ఆమె కనిపించనున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతుంది. ఎంతమంది మొగుళ్లే నీకు అని జగపతిబాబు ఆమెని ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే, ఆమె సోషల్‌గా మూవ్ అయ్యే యువతి అని అర్థమవుతోంది.
భవిష్యత్ కాలంలో జరిగే కథగా 'ఎక్స్‌లైఫ్' కనిపిస్తుంది. సమాజం ముందస్తు ఆలోచనలకు వ్యతిరేకంగా బలంగా మాట్లాడే స్త్రీ దివ్యగా శ్రుతి హాసన్ నటించింది. మనుషులందరూ డేటా పాయింట్స్ తప్ప ఇంకేమీ కారని చెప్పే ఓ యువకుడిని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆమెకు జీవితంలో ఎలాంటి అనుభవం ఎదురయ్యింది? ఆమె ఎలా రియాక్టయ్యిందనేది ఇందులో చూస్తాం.
మనసుకు నచ్చిన పనిచేస్తూ, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి భయపడని యువతి కథ 'పింకీ'. ఆ క్యారెక్టర్‌ను ఈషా రెబ్బ చేసింది. సత్యదేవ్, ఆషిమా నర్వాల్ పాత్రలతో ఆమెకున్న సంబంధమేంటనేది సినిమాలో చూడాల్సిందే.
ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్లు, బోల్డ్ సీన్లకు కొదవలేదని తెలుస్తోంది. తెలుగు ఆడియెన్స్‌కు 'పిట్టకథలు' ఓ సరికొత్త అనుభవాన్నిస్తాయని ఊహించవచ్చు.
టైటిల్: రాములా
నటీనటులు: మంచు లక్ష్మి, సాన్వే మేఘన, నవీన్ కుమార్
రచన-దర్శకత్వం: తరుణ్ భాస్కర్
టైటిల్: మీరా
నటీనటులు: జగపతిబాబు, అమలా పాల్, అశ్విన్ కాకుమాను
రచన: రాధిక ఆనంద్
దర్శకత్వం: బి.వి. నందినీ రెడ్డి
టైటిల్: ఎక్స్ లైఫ్
నటీనటులు: శ్రుతి హాసన్, సంజిత్ హెగ్డే, సంగీత్ శోభన్, అనీష్ కురువిల్లా, యుకెఒ, దయానంద్ రెడ్డి, తన్మయి.
రచన-దర్శకత్వం: నాగ్ అశ్విన్
టైటిల్: పింకీ
నటీనటులు: సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ఆషిమా నర్వాల్.
రచన: ఈమని నందకిషోర్
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి
![]() |
![]() |