![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవితో 'సైరా.. నరసింహారెడ్డి' మూవీని రూపొందించాక కొంత విరామం తీసుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి, తన తదుపరి చిత్రాన్ని అఖిల్ అక్కినేనితో తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కాంబినేషన్ మూవీకి వక్కంతం వంశీ స్క్రిప్ట్‌ను సమకూర్చాడు. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి నిర్మాతగానూ మారుతుండటం గమనార్హం. సరెండర్ 2 సినిమా అనే బ్యానర్‌ను ఆయన నెలకొల్పారు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఆయన నిర్మించనున్నాడు.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో ప్రస్తుతం తన నాలుగో చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'ను చేస్తున్న అఖిల్, దాని తర్వాత సురేందర్ రెడ్డి సినిమాని చేయనున్నాడు. సోమవారమే శర్వానంద్, అజయ్ భూపతి సినిమా 'మహాసముద్రం'ను అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసిన ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర, రెండు రోజుల గ్యాప్‌తో ఇప్పుడు ఈ మూవీని అనౌన్స్ చేయడం విశేషం.
2020 సంవత్సరాన్ని 'సరిలేరు నీకెవ్వరు' లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను ప్రారంభించిన ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఎనౌన్స్ చేస్తూ టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోందని చెప్పాలి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు పనిచేసే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రానికి అజయ్ సుంకర, పతి దీపారెడ్డి సహ నిర్మాతలు. కిశోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతల్ని నిర్వర్తించనున్నాడు.
![]() |
![]() |