![]() |
![]() |
గతంలో కొన్ని కారణాల వల్ల థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా కొన్ని సినిమాలను బ్యాన్ చేయడం చూశాం. మరికొన్ని సినిమాలు థియేటర్‌లో రన్ అవుతున్న టైమ్‌లోనే బ్యాన్ అయ్యాయి. కొన్ని చట్టపరంగా కావచ్చు, మరికొన్ని ప్రజల్లో ఆ సినిమాపై వ్యతిరేకత రావడం వల్ల కావచ్చు. ఆయా సినిమాల ప్రదర్శనలు నిలిపి వేశారు. ఇప్పుడు తాజాగా ఓటీటీలో ఒక స్టార్ హీరో సినిమాను డిలీట్ చేశారు. ఓటీటీ చరిత్రలో ఒక సినిమాను డిలీట్ చేయడం ఇదే తొలిసారి కావచ్చు. ఆ సినిమా అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ సినిమా స్ట్రీమింగ్ నిలిపి వేయాలంటూ మద్రాస్ హైకోర్డు ఆదేశించింది. ఆ మేరకు ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తున్న ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఆ సినిమాను డిలీట్ చేసింది.
వివరాల్లోకి వెళితే... గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో తన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇళయరాజా. తన పాటల కాపీరైట్ విషయంలో ఎంతో కాలంగా పోరాటం చేస్తున్నారాయన. ఈ క్రమంలో చాలా మందికి నోటీసులు ఇవ్వడమే కాకుండా, కోర్టులో ఆయా కేసుల్ని గెలిచారు కూడా. తను క్రియేట్ చేసిన ట్యూన్‌ని వేరొకరు వాడుకోవడానికి వీలు లేదని ఇళయరాజా వాదిస్తున్నారు. అలా వాడే పక్షంలో తనకు రాయల్టీ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఆయన ఎవర్నీ ఉపేక్షించడం లేదు. అలా తన పాటలను వాడుకున్నందుకు స్నేహితులు అని కూడా చూడకుండా వారికి కూడా నోటీసులు పంపించిన సందర్భాలు ఉన్నాయి.
అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. సమ్మర్ స్పెషల్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ఈ సినిమాలో తన పాటల్ని అనుమతి లేకుండా ఉపయోగించారని, ఇది కాపీరైట్ చట్టానికి వ్యతిరేకమని పిటిషన్ వేశారు ఇళయరాజా. సినిమాలోని ఆ పాటలను తొలగించాలని, పాటలు వాడినందుకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇళయరాజా ట్యూన్లను ఈ సినిమాలోని పాటల కోసం కాపీ చేశారని నిర్ధారించారు. దీంతో మద్రాస్ హైకోర్టు.. ఇళయరాజా పాటలను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలో ప్రదర్శించొద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నుంచి తొలగించారు.
![]() |
![]() |