![]() |
![]() |

గంగవ్వ ఏంటీ, 30 ఏటీ అనుకుంటున్నారా? ఇది గంగవ్వ ఏజ్ కాదు. బిగ్ బాగ్ హౌస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె సందడి చేస్తున్న రోజుల లెక్క. హౌస్‌లో ఆమె తనదైన స్టైల్‌తో ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు. హౌస్‌లోకి ఆమె పల్లె అందాన్నీ, యాసనూ, కట్టుబొట్టునూ తీసుకొచ్చారు. 'మై విలేజ్ షో' ద్వారా పాపులర్ అయిన గంగవ్వ.. జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిని, సగం జీవితం పైగా గడిచాక ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. ఎవరికీ భయపడని నైజం, సమయస్ఫూర్తి, ఒకసారి చెప్పగానే విషయం అర్థం చేసుకొనే నేర్పు తనలో ఉందని ఆమె నిరూపించుకున్నారు. అందుకే సెలబ్రిటీలకు ధీటుగా హౌస్‌లో రాణిస్తున్నారు.
.jpg)
పల్లెలో పుట్టి, అక్కడే పెరిగిన ఆమె బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అనగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఎంతోమంది హౌస్‌లో ఆమె ఎన్ని రోజులుంటుందిలే అని పెదవి విరిచారు. అయితే మొదటివారంలోనే తన వర్కవుట్స్‌తో ఆమె హౌస్ మెంబర్స్‌ను ఆకట్టుకున్నారు. వాతావరణం కొత్త కావడం, తనకు సరిపడేట్లు కనిపించకపోవడంతో, ఆరోగ్య రీత్యా ఇబ్బందిపడిన ఆమె రెండో వారంలో ఇంటికెళ్లిపోతానంటూ ఏడ్చేశారు. ఆమెకు హోస్ట్ నాగార్జున ఊరడించి, ధైర్యమిచ్చారు. "నన్ను అన్నా అని పిలిచావ్ కదా.. నీకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటాం.. నీకు ఉండాలనిపించినన్ని రోజులుందువు గానీ" అని భరోసా ఇచ్చారు.
.jpg)
ఆ తర్వాత నుంచీ బిగ్ బాస్ 4కు గంగవ్వ ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. ఆరోగ్యం కుదుటపడి, వాతావరణం అలవాటయ్యాక ఆమెలోని గడుసుదనం బయటకు వచ్చింది. హౌస్ మెంబర్స్ అందరితోనూ కలిసిపోతూ, పిల్లలను మందలించే విధంగానే వారిపై అప్పుడప్పుడు కోపతాపాలు ప్రదర్శస్తూ, అప్పుడప్పుడు మురిపిస్తూ, పెద్దరికాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. బామ్మ, అమ్మమ్మ ఉంటే ఎలా ఇల్లు సందడిగా ఉంటుందో, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అంతటి సందడిగా ఉంటోంది.
.jpg)
మూడో వారం టాస్కుల్లో తన సత్తా చూపించారు గంగవ్వ. అంతేనా! హౌస్ కెప్టెన్సీ కూడా దక్కించుకున్నారు. ఉక్కుమనిషి టాస్క్‌లో మిగతా కంటెస్టెంట్లతో పోటాపోటీగా ఆడారు. శక్తియుక్తుల్లో తనేం తక్కువ కాదనిపించుకున్నారు. వయసు రీత్యా ఫిజికల్ టాస్కులకు దూరంగానే ఉన్నప్పటికీ వేకప్ సాంగ్స్, డాన్స్.. మిగతా టాస్కుల్లో తన సత్తా చూపించారు. నిజానికి తొలి వారంలోనే ఆమె ఎలిమినేషన్ జాబితాలో చేరారు. అయితే ఫ్యాన్ ఫాలోయింగ్‌తో సగం ఓట్లు దక్కించుకుని, ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు.
.jpg)
ఎనిమిది గజాల చీరను గోచీలా కట్టే విధానం, అమాయకురాలిలా కనిపిస్తూనే గడుసుదనం ప్రదర్శించడం వీక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. నాలుగో వారంలో "ముత్యాలూ వస్తావా.. అడిగింది ఇస్తావా" పాటలో అల్లు రామలింగయ్యను అనుకరిస్తూ కుమార్ సాయిని ఆమె ఆట పట్టించిన విధానం అందర్నీ అలరించింది. మొత్తానికి బిగ్ హౌస్‌లో ముచ్చటగా 30 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసేశారు గంగవ్వ. అనుబంధాల విలువ తెలియజేస్తూ తన ప్రెజెన్స్‌కు న్యాయం చేస్తూ వస్తున్న గంగవ్వ.. ఇంకెన్ని రోజులు వీక్షకుల్ని ఆకట్టుకుంటూ, హౌస్‌లో నిలుస్తారో చూడాలి.
![]() |
![]() |