![]() |
![]() |

బెంగాలీ నటి, 'డర్టీ పిక్చర్'లో విద్యా బాలన్‌తో కలిసి నటించిన ఆర్య బెనర్జీ శుక్రవారం కోల్‌కతాలోని తన నివాసంలో మృతి చెందారు. ఆమెది అనుమానాస్పద మృతిగా పోలీసులు పరిగణిస్తున్నారు. ఆర్య వయసు 33 సంవత్సరాలు. సౌత్ కోల్‌కతాలోని జోధ్‌పూర్ పార్క్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. పోలీసులు ఆమె ఫ్లాట్ డోర్ పగులకొట్టి, లోపలకు వెళ్లి, బెడ్‌రూమ్‌లో పడివున్న ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె వాంతి చేసుకున్న ఆనవాళ్లు కనిపించాయి. బెడ్‌రూమ్‌లోని ఫ్లోర్‌మీద బోర్లాపడినట్లుగా ఆమె దేహం ఉంది. ఫ్లోర్‌పై కొన్ని రక్తపు బొట్లు కూడా ఉన్నాయి. ఆర్యకు దేవదత్తా అనే మరో పేరు కూడా ఉంది.
"ప్రాథమికంగా అనుమానించదగ్గ అంశాలేమీ కనిపించలేదు. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ అనంతరం మృతికి కచ్చితమైన కారణం తెలుస్తుంది" అని లేక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. దివంగత సితార్ ప్లేయర్ నిఖిల్ బంధోపాధ్యాయ్ కుమార్తె అయిన ఆర్య మొదట మోడల్‌గా పనిచేసి తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 'ఎల్ఎస్‌డి: లవ్ సెక్స్ ఔర్ ధోకా' (2010), 'ద డర్టీ పిక్చర్' (2011) సహా మరికొన్ని సినిమాల్లో నటించారు.
శుక్రవారం ఉదయం పనిమనిషి వచ్చి డోర్ బెల్ కొట్టింది. రెస్పాన్స్ లేకపోవడంతో, ఫోన్ చేసింది. అయినా ఆర్య నుంచి స్పందన రాలేదు. దాంతో పొరుగున ఉంటున్న వారికి చెప్పింది. వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఆర్య ఒంటరిగానే ఉంటున్నట్లు పనిమనిషి తెలిపింది.
![]() |
![]() |