![]() |
![]() |

రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా అభిమానులతో పాటు రాజకీయ రంగంలోని వారినీ అత్యంత ఉత్కంఠకు గురిచేసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల అంకం ముగిసింది. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించి, 'మా' నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అందరికంటే ఎక్కువగా నష్టపోయిందీ, నగుబాటు పాలయ్యిందీ మెగా బ్రదర్ నాగబాబు అని చెప్పాలి.
ఎలాగైనా 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌నూ, ఆయన ప్యానల్‌నూ గెలిపించాలని కంకణం కట్టుకున్న నాగబాబు, మెగా కాంపౌండ్ ఆశీస్సులు ప్రకాశ్‌రాజ్‌కు ఉన్నాయనే అభిప్రాయాన్ని కలిగించారు. చిరంజీవి బాహాటంగా చెప్పకపోయినా ఆయన మద్దతు ప్రకాశ్‌రాజ్‌కే ఉందని నాగబాబు మీడియా సాక్షిగా చెప్పారు. ఆయన మాటల్ని చిరంజీవి ఖండించలేదు. దాంతో సహజంగానే మెగా హీరోలందరూ ఆయనవైపే ఉన్నారని అందరూ భావించారు. ఇండిపెండెంట్‌గా జనరల్ సెక్రటరీ పదవికి తాను వేసిన నామినేషన్‌ను పవన్ కల్యాణ్ సూచనతో విరమించుకున్నానని బండ్ల గణేశ్ చెప్పడంతో, పవర్‌స్టార్ మద్దతు సైతం ప్రకాశ్‌రాజ్‌కే ఉందని స్పష్టమైంది.
ఈ సంగతులు అలా ఉండగా, ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌ను గెలిపించే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నట్లు నాగబాబు వ్యవహరించారు. ఈ క్రమంలో తెలుగు నటులనందర్నీ చులకన చేస్తూ ఆయన మాట్లాడారు. మనవాళ్లకంటే ప్రకాశ్‌రాజ్ గొప్ప యాక్టర్ అని ఒప్పుకోండర్రా.. అంటూ తెలుగు నటులపై ఎకసెక్కాలు ఆడారు. ఆరోజు ఆయన ప్రకాశ్‌రాజ్‌ను ఆకాశానికెత్తేస్తూ, తెలుగునటులను తక్కువ చేస్తూ మాట్లాడిన తీరు, ఆయన నవ్విన తీరు.. నటులనే కాదు, మొత్తం తెలుగు చిత్రపరిశ్రమనే అవాక్కయ్యేలా చేసింది. ప్రకాశ్‌రాజ్ మీద ఎంత వీరాభిమానం ఉంటేనేం, మన నటులను అలా చులకన చేస్తూ, ఎకసెక్కాలు ఆడాలా.. అని అనేకమంది అభిప్రాయపడ్డారు.
నాగబాబు అంతటితో ఆగకుండా, తెలుగు సినిమా ముద్దుబిడ్డల్లో ఒకరిగా పరిగణించే కోట శ్రీనివాసరావు లాంటి లెజెండరీ క్యారెక్టర్ ఆర్టిస్టుపై అవాకులు చవాకులు పేలడమే కాకుండా, ఆయన ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు ఊడిపోతాడో తెలీదంటూ అనుచితంగా మాట్లాడటం కూడా తెలుగు నటుల్లో ఆయనపై ఏహ్యభావం కలిగేలా చేశాయి. నాగబాబు వ్యాఖ్యలు ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు మేలు చేయడం అటుంచి, తీవ్రంగా నష్టపరిచాయని, అందుకే ఏకంగా 107 ఓట్ల ఆధిక్యంతో ఆయనపై మంచు విష్ణు గెలిచేలా చేశాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విష్ణు ఘనవిజయంతో షాకైన నాగబాబు, "ప్రాంతీయవాదంతో, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా"నంటూ ప్రకటించారు. ఆయన ప్రకటనపై ఎవరూ పెద్దగా బాధపడటం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. పైగా నాగబాబు పరిస్థితి చూస్తుంటే జాలి కలుగుతోందనీ, తెలుగు నటులపై ఎకసెక్కాలాడిన ఆయన ఈ మొత్తం ఎపిసోడ్‌లో నవ్వులపాలయ్యారనీ చెప్పుకుంటున్నారు.
![]() |
![]() |