![]() |
![]() |

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్.. ప్రెజెంట్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరీ ముఖ్యంగా.. ఈ సంక్రాంతికి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం.. తమన్ దశను, దిశను పూర్తిగా మార్చేసింది. ఫలితంగానే ప్రస్తుతం టాలీవుడ్లో నిర్మాణంలో ఉన్న పద్నాలుగు క్రేజీ ప్రాజెక్టులలో ఆరు సినిమాలు తమన్ ఖాతాలో ఉన్నాయి.
నటసింహ నందమూరి బాలకృష్ణ – స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ‘BB3’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిలిమ్ ‘వకీల్ సాబ్’, సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’, యంగ్ టైగర్ యన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెకెండ్ జాయింట్ వెంచర్ (యన్టీఆర్ 30), మాస్ మహరాజా రవితేజ ‘క్రాక్’, రవితేజ – రమేష్ వర్మ కాంబినేషన్ మూవీ.. ఇలా నిర్మాణ దశలో ఉన్న, నిర్మాణానికి సిద్ధమవుతున్న ఆరు స్టార్ హీరోల చిత్రాలు తమన్ స్వరకల్పనలోనే రూపొందుతుండడం వార్తల్లో నిలుస్తోంది. వీటిలో ఒక్క పవన్ కళ్యాణ్‌తో తప్ప మిగిలిన స్టార్స్ కాంబినేషన్లో ఇప్పటికే తమన్ కలిసి పనిచేశాడు.
ఇక మిగిలిన ఎనిమిది క్రేజీ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’, ‘కింగ్’ నాగార్జున ‘వైల్డ్ డాగ్’, యన్టీఆర్ - రామ్ చరణ్ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ ఆర్ ఆర్), ప్రభాస్ పిరియడ్ రొమాంటిక్ సాగా (ప్రభాస్ 20), పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ మూవీ, పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సెకండ్ జాయింట్ వెంచర్, అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రాలు వేర్వేరు సంగీత దర్శకుల చేతిలో ఉన్నాయి. ‘ఆచార్య’, ‘నారప్ప’కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తుంటే.. ‘ఆర్ ఆర్ ఆర్’, పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ మూవీకి స్వరవాణి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ మూవీ, ‘పుష్ప’కి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ కడుతున్నాడు. ప్రభాస్ పిరియడ్ రొమాంటిక్ సాగాకి అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ‘వైల్డ్ డాగ్’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తమ్మీద ప్రస్తుతం తెలుగునాట క్రేజీ ప్రాజెక్టుల పరంగా తమన్ హవా నడుస్తున్నదనే చెప్పాలి.
![]() |
![]() |