![]() |
![]() |

పాపులర్ బాలీవుడ్ నటుడు, 'ఎంఎస్ ధోనీ' ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన వయసు 34 సంవత్సరాలు. ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో ఉరివేసుకొని చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొంతకాలంగా ఆయన డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవలి కాలంలోనే రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్‌ను కోల్పోయిన బాలీవుడ్‌కు ఇది మరో దెబ్బ. వీరిలో ఇర్ఫాన్, రిషి.. ఇద్దరూ కేన్సర్‌తో చనిపోగా, గుండె సంబంధిత సమస్యతో వాజిద్ మరణించాడు. అయితే సుశాంత్ సింగ్ మృతి అందుకు భిన్నమైనది.
సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఈ వారం మొదట్లోనే ఆత్మహత్య చేసుకోవడం ఇక్కడ గమనార్హం. సోమవారం రాత్రి ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో తన ఫ్లాట్ ఉన్న 14వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి తీవ్ర గాయలతో మృతి చెందింది. ఆమె విషాద మరణానికి సుశాంత్ సంతాపం తెలియజేశాడు కూడా.
షారుఖ్ ఖాన్ తరహాలో టెలివిజన్ నుంచి సినిమాల్లోకి సక్సెస్ అయిన నటుడు సుశాంత్ సింగ్. 'పవిత్ర రిష్తా' అనే టీవీ సీరియల్‌తో నటుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన, ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. మొదట్లోనే 'కై పో చే', 'శుద్ధ్ దేశీ రొమాన్స్' సినిమాలతో ఆకట్టుకున్న సుశాంత్ సింగ్‌కు 2016లో భారత అగ్రశ్రేణి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్ అయిన 'ఎం.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ' గొప్ప పేరుని తీసుకొచ్చింది. ఈమధ్య కాలంలో 'కేదార్‌నాథ్' (2018), 'చిచ్చోరే' (2019) సినిమాలతో ఆయన ఆకట్టుకున్నాడు. సుశాంత్ సింగ్ మునుపటి మూవీ 'డ్రైవ్' థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయింది. అతను చివరగా నటించిన 'దిల్ బేచారా' విడుదలకు సిద్ధమవుతోంది. జాన్ గ్రీన్ ప్రఖ్యాత నవల 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' ఆధారంగా ఇది రూపొందింది.
![]() |
![]() |