![]() |
![]() |

‘ఇస్మార్ట్ శంకర్’.. గత ఏడాది బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సినిమాల్లో ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా జనం ముందుకు వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ.. అనూహ్య విజయం సాధించింది. అంతేకాదు.. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ, యువ కథానాయకుడు రామ్.. ఇలా ఈ ముగ్గురికీ బౌన్స్ బ్యాక్ మూవీగా నిలిచింది. రామ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డులకెక్కింది. అలాగే యంగ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్ కెరీర్‌లో బెస్ట్ హిట్‌గా నమోదయింది.
అలాంటి ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్ల విషయంలోనే కాదు మ్యూజికల్‌గానూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇందులోని ప్రతీ పాట యువతరాన్ని మెప్పించింది. మరీ ముఖ్యంగా.. ‘దిమాక్ ఖరాబ్’, ‘ఇస్మార్ట్ శంకర్’ టైటిల్ సాంగ్ కుర్రకారుని ఫిదా చేసేశాయి. థియేటర్లలోనే కాదు యూట్యూబ్ ముంగిట కూడా ఈ పాటలు ఉర్రూతలూగించాయి. రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్‌పై చిత్రీకరించిన ‘దిమాక్ ఖరాబ్’ పాట ఇప్పటికే సెంచరీ మిలియన్ వ్యూస్ (10 కోట్ల వీక్షణలు) క్లబ్‌లో స్థానం దక్కించుకోగా.. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ టైటిల్ సాంగ్ కూడా ఈ క్లబ్‌లో చేరిపోయింది. దీంతో.. ‘ఇస్మార్ట్ శంకర్’లోని రెండు పాపులర్ నంబర్స్ కూడా సెంచరీ క్లబ్‌లో స్థానం దక్కించుకున్నట్లు అయింది.
మరోవైపు.. ‘ఇస్మార్ట్ శంకర్’ హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే 110 మిలియన్లకు పైగా వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోంది. మొత్తమ్మీద.. రెండు వీడియో సాంగ్స్‌తోనూ, హిందీ వెర్షన్‌తోనూ ‘ఇస్మార్ట్ శంకర్’ సెంచరీ క్లబ్‌లో హ్యాట్రిక్ కొట్టడం విశేషం.
![]() |
![]() |