![]() |
![]() |

మోహన్‌బాబు ప్రధాన పాత్రధారిగా డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేసిన సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌తో కలసి విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్‌బాబు స్వయంగా ఈ మూవీకి స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ఫిబ్రవరి 18న 'సన్ ఆఫ్ ఇండియా'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోహన్‌బాబు, ఈ మూవీలో అమ్మాయిల మధ్య లిప్ లాక్ సీన్లు ఉన్నాయనే విషయాన్ని ధ్రువీకరించారు. "ఈ చిత్రంలో అమ్మాయిల మధ్య లిప్ లాక్ సీన్లు ఉన్నాయి. కథ డిమాండ్ చేయడం వల్లే వాటిని పెట్టాల్సి వచ్చింది. విష్ణు ఈ సన్నివేశాలకు ససేమిరా అన్నాడు. ఒప్పుకోలేదు. 'వద్దు డాడీ' అని చెప్పాడు. 'మనకు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. విద్యాసంస్థలు కూడా నడుపుతున్నాం. అలాంటిది ముద్దు సన్నివేశాలు పెడితే ఎలా?' అని అడిగాడు. 'మోహన్ బాబు ఎలాంటి వాడో అందరికి తెలుసు. కథ డిమాండ్ చేసింది కాబట్టే పెడుతున్నాం. తప్పులేదు. అందరూ దీనిని అర్థం చేసుకుంటారు' అని విష్ణుని ఒప్పించా." అని వెల్లడించారు మోహన్‌బాబు.
"నా ప్రవర్తన బాగాలేని రోజు మోహన్ బాబు బతకడానికే అర్హుడు కాదు అని నేనే భావిస్తా." అని ఆయన అన్నారు. "ఒక ఎమ్మెల్యే వల్ల జీవితం నాశనం అయిన వ్యక్తి జైలు నుంచి తప్పించుకుని ఏం చేశాడనేది ఈ చిత్ర కథ. ఈ చిత్రం నిడివి గంటన్నర మాత్రమే. థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది" అని తెలిపారు మోహన్ బాబు.
ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్, ఫృథ్వీ రాజ్, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.
![]() |
![]() |