![]() |
![]() |
మోహన్‌లాల్, మమ్ముట్టి మలయాళ చిత్రరంగంలో సూపర్‌స్టార్స్‌గా వెలుగొందుతున్నారు. వీరి సినిమాలు తెలుగులోనూ డబ్ అయి రిలీజ్ అవుతుంటాయి. కానీ, వీరిద్దరిలో మమ్ముట్టికే తెలుగులో ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. డబ్బింగ్ సినిమాలతో పాటు తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు కూడా చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మమ్ముట్టి. మోహన్‌లాల్ మలయాళంలో కొన్ని వందల సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ తెలుగులో చేసిన స్ట్రెయిట్ సినిమాలు మనమంతా, జనతా గ్యారేజ్. ఈ రెండు సినిమాల్లో జనతా గ్యారేజ్ సూపర్‌హిట్ అయ్యింది.
ఇటీవలికాలంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన కొన్ని సినిమాలను తెలుగులోకి అనువదించి రిలీజ్ చేశారు. కానీ, ఉపయోగం లేకుండా పోయింది. ఆ సినిమాలను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. ‘మలైకొట్టయి వాలిబన్’ పేరుతో మలయాళంలో రూపొందిన సినిమాని ప్యాన్ ఇండియా మూవీగా దేశంలోని పలు భాషల్లోకి అనువదించి రిలీజ్ చేయబోతున్నారు. జనవరి 25న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు అనుకూల పరిస్థితులు లేవు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమైంది. రిలీజ్‌కి కొన్ని సమస్యలు ఏర్పడడంతో సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అయినప్పటికీ తెలుగు బయ్యర్లు సినిమాపై అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానికి కారణం.. అదే రోజున ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’ రిలీజ్ అవుతున్నాయి. అలాగే శివకార్తికేయన్ ‘అయలాన్’ జనవరి 26కి వస్తోంది.
ఇదిలా ఉంటే... మరో పక్క ‘హనుమాన్’ దూకుడుగా వెళుతోంది. పండగ సినిమాల్లో నా సామిరంగ, గుంటూరు కారం చిత్రాలు కూడా నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇన్ని అవరోధాల మధ్య తన సినిమా ఎంతవరకు నిలబడుతుంది అనే సందేహం మోహన్‌లాల్‌కి కూడా ఉందట. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ రావాలని అనుకున్న లాల్ ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆలోచనలో పడ్డాడని తెలుస్తోంది. మరి తన కొత్త సినిమాను జనవరి 25కి రిలీజ్ చేస్తాడా లేక వాయిదా వేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
![]() |
![]() |