![]() |
![]() |

ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'హనుమాన్'(Hanuman) సంచలనాలు సృష్టిస్తోంది. జనవరి 12న విడుదలైన ఈ సూపర్ హీరో ఫిల్మ్ అంచనాలకు మించిన వసూళ్లు రాబడుతోంది. మొదటి వారంలోనే రూ.140 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి.. రూ.200 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. వీక్ డేస్ లో కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. స్క్రీన్స్ పెంచాలనే డిమాండ్స్ ఆడియన్స్ నుండి వస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణ కోసం మూవీ టీం ప్రత్యేక షో వేసింది. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కూడా హనుమాన్ చిత్రాన్ని వీక్షించింది.
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో కలిసి తాజాగా హైదరాబాద్ లోని ఏఎంబీలో సమంత 'హనుమాన్' మూవీ చూసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆమె.. చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించింది. మనలో చిన్న పిల్లల మనస్తత్వాన్ని తట్టి లేపేవి గొప్ప సినిమాలు అవుతాయని, అలాంటి గొప్ప సినిమా హనుమాన్ అని సమంత అభిప్రాయపడింది. విజువల్స్, మ్యూజిక్, కామెడీ, వీఎఫ్ఎక్స్, పర్ఫామెన్స్ లు అన్నీ అద్భుతంగా ఉన్నాయని.. వెండితెరపై హనుమాన్ అద్భుతాన్ని సృష్టించిందని సామ్ ప్రశంసించింది. ఇంత మంచి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మకి థాంక్స్ చెప్పిన సమంత.. ఈ యూనివర్స్ లో భాగంగా రానున్న తదుపరి సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇక తనతో కలిసి 'ఓ బేబీ' సినిమాలో నటించిన తేజ సజ్జను ప్రత్యేకంగా అభినందించింది. అతని నటన 'హనుమాన్' సినిమాకి ప్రాణంగా నిలిచిందని ప్రశంసలు కురిపించింది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు మూవీ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పింది సమంత.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్(PVCU)లో భాగంగా మొదటి సినిమాగా 'హనుమాన్' రూపొందింది. ఈ యూనివర్స్ లో భాగంగా 'అధీర', 'జై హనుమాన్' సహా పలు సూపర్ హీరో ఫిల్మ్ లు రానున్నాయి.

![]() |
![]() |