![]() |
![]() |

లాక్‌డౌన్ ముందు దేవి థియేటర్‌లో సినిమా చూసి బయటికొస్తుంటే, ఎవరో ఇద్దరు ప్రేక్షకులు - "ఇది మాల మాదిగోళ్ల సినిమా ఎహె" అని - అని గొణుక్కుంటూ వెళుతున్నారు. 'పలాస' మీద వాళ్ల రియాక్షన్ అది-పాపం ఏ మాత్రం తెలిసివున్నా రాకపోయేవాళ్లు.!
మరి ఈ లెక్కన ఇప్పటి వరకూ వచ్చిన వందల వేల సినిమాలు ఎవరివి? పెట్టుబడి ఉన్న మూడు నాలుగు కులాలదే ఫీల్డ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే ! అప్పుడప్పుడు ఫలానా రెడ్డి, ఫలానా చౌదరి, ఫలానా నాయుడు అంటూ తోకలతో సహా టైటిల్స్ పెట్టి వదులుతుంటారు. వాటిల్లో వాళ్ల హీరోయిజమూ, డైలాగులూ , ఆ డాబూ దర్పమూ చెప్పనలవి కాదు. తోకలకుండే పవర్ సామాన్యమైనదా?
ఏకంగా కులంపేరుతో తీసినా, హిట్ చేసిన కోట్ల మందిలో ఒక్కడైనా ,. ఇది ఫలానా కులపోళ్ల సినిమా ఎహె అని అన్నాడా ఎవరికీ ఎందుకని అనాలనిపించలేదు? ఒక్క 'పలాస'కే ఎందుకనిపించింది వాళ్లకి ?
సాధారణంగా - మన సినిమాల్లో కులం అమూర్తం. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటారేమో ? కులం పేరు చెప్పకుండా , బడుగు జీవులను చూపిస్తారు, హీరో ఉద్ధరించగానే బాబు గారూ అంటూ మెడలో ఉన్న కండువాతో కళ్లు తుడుచుకోవటం వరకే వాళ్ల పని. హీరోను ఎలివేట్ చేయడానికి వాళ్లు అవసరం.
ఇక వర్గపోరాటం జానర్ సినిమాల్లో నారాయణమూర్తి లాంటి వాళ్లకి అమ్మవారు పూనితే, బడుగులు విప్లవిస్తారు. తూర్పు ఎర్రబారటంతో ఎండ్ కార్డు పడుతుంది. ఇక్కడా కులం చెప్పరు. చివరికి కళాతపస్వి కూడా దళితజీవితాన్ని చిత్రించాడు. చెప్పులు కుట్టేవాడూ, వాడి పెళ్లామూ, వాడి ఇంట్లో పందిరిగుంజలూ .. అబ్బో ఎవరిని కదిలించినా ఇంగువ సంగీతమే..... అది డప్పు లేని పప్పుకూడు. మాదిగజీవితాన్ని చిత్రించిన సినిమాలో డప్పు కనిపించదు, వినిపించదు!
తెలుగు సినిమాకీ వాస్తవికతకీ వందమైళ్ల దూరం. మగ తొడలు కొట్టుకుంటూ, ఆడ తొడలు చూపుకుంటూ, కొన్ని ఫార్ములాల్లో గిరికీలు కొడుతూ, హీరోయిజాన్ని తప్ప మరి దేన్నీ పట్టించుకోకుండా బండి లాగిస్తుంటారు. అయితే కులాన్నీ సమాజవాస్తవికతనూ కళ్లకు కట్టించే సినిమాలు చాలా అరుదు. తొలినాళ్లలో 'మాలపిల్ల'తో మొదలుపెట్టి, మొన్నీ మధ్య వచ్చిన 'కంచె' వరకూ చెదురుమదురు. చాలాకాలంగా పచ్చి కమర్షియల్ సినిమాలదే రాజ్యం.
ఇటువంటి తరుణంలో , కొంచెం రియలిస్టిక్ సినిమాలు కావాలంటే ఎంతసేపూ, ఆ కోలీవుడ్‌వైపూ, మాలీవుడ్‌వైపూ చూడాల్సిందేనా ? ఇక్కడ ఎవరూ లేరా ? అన్న ప్రశ్నలకు జవాబే 'పలాస'.. కరుణకుమార్!
సినిమాగురించి చెప్పుకునే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పుకుందాం. తెలుగునాట పుట్టు సంస్కృతం బ్యాచ్, ఆ భాషను వదిలేసి, అందరికంటే ముందే ఇంగ్లీష్ నేర్చుకుని, కాలంతో పాటు ముందుకెళ్లిపోయింది. కానీ నిరక్షరాస్యులు, తెలుగు చదవటం రాయటం రానివాళ్లు కూడా ఊరూరా సంస్కృతభూయిష్టమైన పద్యనాటకాలను కాపాడారు. నిన్న మొన్నటివరకూ పల్లెల్లోని దళిత బహుజనుల ఇళ్లలో, కనిపించిన హార్మోనియం పెట్టెలే సాక్ష్యం. పౌరాణిక నాటకాల్లో బాగా పేరు తెచ్చుకున్న చీమకుర్తి నాగేశ్వరరావు దగ్గర్నుంచి - తమ ఊరికే మాత్రమే పరిమితమై నాటకాలేసుకునే ఔత్సాహిక దళితబహుజనులెందరో
కనిపిస్తారు.

ఉత్తరాంధ్రలో అటువంటి ఒక కళాకారుడే పద్యాల సుందరరరావు. అతడికి ఇద్దరు కొడుకులు. రంగారావు, మోహన్‌రావు. వాళ్లే ఈ కథకు హీరోలు. జానపదాలు పాడుకుని, జనాన్ని రంజింపచేసే కళాకారులు. అయతే వీళ్లిద్దరూ , మిగతా సినిమాల్లో మాదిరిగా అగ్రకులాలు ధాష్టీకం చేసినా, 'అట్టాగే బాబు గోరూ' అని పడి ఉండే రకం కాదు. ఆత్మగౌరవం ఉన్నవాళ్లు. ఊరుకీ, వాడకీ మధ్య ఉన్న అంటును ప్రశ్నిస్తారు. బావిలో నీళ్లు తోడనివ్వకుండా అడ్డుపడి, దాడికి దిగిన యువకులను మోహన్‌రావు గట్టిగా ఎదుర్కొంటాడు. ఆ సందర్భంలోనే, 'మావోళ్లతో పడుకోవడానికి అంటు ఉండదా?' అని ఆడవాళ్లు, అగ్రకుల యువకుల్ని నిలదీస్తారు. మరో సందర్భంలో తమ ఆడవాళ్లను అవమానించిన పెద షావుకారు కొడుకును మోహనరావు, రంగారావు చితక్కొట్టి, నెలల తరబడి ఆస్పత్రిలో ఉండేలా చేస్తారు.
దీంతో కథ పాకాన పడుతుంది. పెద షావుకారు, బైరాగి అనే పెద్ద రౌడీని ప్రయోగిస్తాడు. ఆ బైరాగిని చంపేసిన అన్నదమ్ములను చిన షావుకారు చేరదీస్తాడు. తన రాజకీయ ఎదుగుదలకి వాడుకుంటాడు. లోకల్ ఎన్నికల్లో తనకు కూడా అవకాశమివ్వాలని రంగారావు అడిగినందుకు, చిన షావుకారు సహించలేడు. కులం పేరుతో తిట్టి, మెడపట్టి గెంటేస్తాడు. తమ మధ్య చిచ్చుపెట్టి, చంపాలని చూసిన పెదషావుకారును కూడా అన్నదమ్ములు హతమార్చుతారు. అలా, కళాకారులు కాస్తా రౌడీలుగా , హంతకులుగా మారిపోతారు. చినషావుకారు, పెద్దషావుకారు కొడుకు ఒక్కటైపోతారు. రంగారావుని ఘోరంగా చంపేస్తారు.
పోలీస్ ఇన్స్‌పెక్టర్ సెబాస్టియన్ ఎంటరవుతాడు. అతడిది కూడా మోహనరావు వర్గమే. చదువు ఆవకశ్యతను, అంబేద్కర్ పేరు చెప్పకుండా, ఆయన ఫిలాసఫీని బోధిస్తాడు. హీరోకీ అతడికీ మధ్య చాలా చర్చ... తెగిపడిన వినాయకుడి తల అంటించిన శాస్త్రం, ఏకలవ్యుడి బొటనవేలు ఎందుకు అతికించలేకపోయిందన్న దగ్గర్నుంచి ఎన్నో ప్రశ్నలు.. ! అప్పుడు చనిపోయాడనుకున్న మోహనరావు, మళ్లీ చాలా ఏళ్లకి పలాసలో ఎంటరవుతాడు, విలన్‌ల తలలు నరికి కథకు ముగింపునిస్తాడు.
'పలాస' గొప్పతనమంతా సహజత్వంలోనే ఉంది. పాటలైనా, డైలాగులైనా, నటీనటుల నటనైనా.. 'నాదీ నక్కిలీసు గొలుసు', 'బావొచ్చాడోలప్పా బావొచ్చాడు' లాంటి జానపద గీతాలు చెవులకి ఎంత ఇంపుగా ఉన్నాయో.. ఇక నటుల విషయానికి వస్తే, రంగారావు, పెద్దషావుకారు జీవించారని చెప్పాలి.
మొత్తం మీద ఒక కొత్త కథ. ఇప్పటివరకూ ఈ మాత్రమైనా చూపడానికి నోచుకోని వ్యధ. గతాన్నీ, వర్తమానాన్నీ గురిపెట్టిన డైలాగులు. . ఇటువంటి సినిమా తీయడమే సాహసమనుకుంటే, పూర్తిగా ఉత్తరాంధ్ర భాషలో నడిపించడానికి ఇంకెంత దమ్ము కావాలి. ఇటువంటి కథకి పెట్టుబడి పెట్టిన నిర్మాతను ప్రత్యేకంగా అభినందించాలి. సినిమాలో పొరపాట్లు, తడబాట్లు ఉంటే ఉండొచ్చు. దర్శకుడికిది తొలి అడుగు, పైగా కొత్తదారి. అందుకు మెచ్చుకోవచ్చు.
దేవీ థియేటర్‌లో ప్రేక్షకులు చిరాకు పడినట్టు, ఇది కేవలం మాల మాదిగోళ్ల సినిమా కాదు. పంచరంగుల ప్రపంచంలో ఇన్నాళ్లుగా చోటు దొరకని పంచమవర్ణం లైఫ్. సమాజాన్నీ, రాజకీయాన్నీకులం కోణంలో చూపించిన అద్దం. రోజూ చూస్తూ కూడా చూడటానికి నిరాకరించే వాస్తవానికి దృశ్యరూపం. అన్నింటికి మించి, ఆలోచనకి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వని రొటీన్ సినిమాల మధ్య, ఎప్పటికీ వెంటాడే పదునైన ప్రశ్నల గుచ్ఛం!
- ఎం. సాంబశివరావు
![]() |
![]() |