![]() |
![]() |

దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా.. తనే ఓ స్త్రీ గురించి దారుణ వ్యాఖ్యలు చేసి, పైగా అది తప్పని విమర్శించిన వారిపైనే కేసు పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్.
విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'లియో' సినిమాలో మన్సూర్ అలీ ఖాన్ నటించాడు. ఎందరో హీరోయిన్లతో రేప్ సీన్లు చేసిన తనకు, లియోలో త్రిషతో రేప్ సీన్ ఉంటుంది అనుకున్నానని.. కానీ దర్శకుడు త్రిషతో సీన్ పెట్టకుండా డిజప్పాయింట్ చేశాడని మన్సూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో సౌత్ ఇండస్ట్రీలో దుమారం రేగింది. త్రిష అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు మెగాస్టార్ చిరంజీవి, కుష్బూ వంటి వారు మద్దతుగా నిలుస్తూ.. మన్సూర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో త్రిషకి క్షమాపణలు చెప్పిన మన్సూర్.. ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించాడు. తన మాటలను వక్రీకరించారని.. త్రిష, చిరంజీవి, కుష్బూ వ్యాఖ్యలు తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ.. వారిపై పరువు నష్టం దావా వేశాడు. దీనిపై తాజాగా విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మన్సూర్ కి చివాట్లు పెట్టింది. ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కోవడం, పైగా మీరే అమాయకుడునని చిత్రీకరించుకుంటున్నారు అంటూ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. పబ్లిక్ లో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని.. మీరు కేసు పెట్టడం కాదు, నిజానికి త్రిషనే మీ మీదే కేసు పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు చివాట్లతోనైనా మన్సూర్ అలీ ఖాన్ తీరులో మార్పు వస్తుందేమో చూడాలి.
![]() |
![]() |