![]() |
![]() |

'కన్మణి రాంబో ఖతీజా'.. ఇది నయనతార, విజయ్ సేతుపతి, సమంత కలిసి నటించిన సినిమా. తమిళంలో 'కాత్తువాకుల రెండు కాదల్' పేరుతో నయన్ బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ రూపొందించిన ఈ సినిమా తెలుగులో 'కన్మణి రాంబో ఖతీజా' (కెఆర్‌కె) పేరుతో ఈ రోజు (ఏప్రిల్ 28) సమంత బర్త్‌డే సందర్భంగా విడుదలైంది. ఆడియెన్స్‌లో ఎంతో పాపులారిటీ ఉన్న ముగ్గురు స్టార్లు కలిసి నటించిన సినిమా కావడంతో, దానిపై క్రేజ్ విపరీతంగా ఉంటుందనీ, ఆడియెన్స్ పొలో మంటూ థియేటర్లకు తరలి వస్తారనీ ఆశించిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు షాక్‌కు గురవుతున్నారు.
'జాను' మూవీ తర్వాత సమంత పూర్తి స్థాయి పాత్రలో కనిపించిన మూవీ ఇదే. దీనికి ముందు ఆమె 'ద ఫ్యామిలీమ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకు వచ్చింది. అలాగే 'పుష్ప' మూవీలో 'ఊ అంటావా మావా ఉఊ అంటావా' అంటూ ఐటమ్ సాంగ్‌తో అలజడి రేపింది. అందుకే 'కెఆర్‌కె' మూవీపై ఆడియెన్స్ మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారని ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి.
కానీ బుక్ మై షోలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను ఓసారి గమనిస్తే ఆశ్చర్యపోక మానరు. హైదరాబాద్‌లో పలు థియేటర్లలో ఈ సినిమా రిలీజైనా ఏ ఒక్క షో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఫుల్ కాలేదంటే.. అదీ అతి తక్కువ టిక్కెట్లు మాత్రమే బుక్ అవుతున్నాయంటే.. షాకింగ్ అనిపించక మానదు.
అనిరుధ్ రవిచందర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, యస్.ఆర్. కదిర్ లాంటి సినిమాటోగ్రాఫర్, ఎ. శ్రీకరప్రసాద్ లాంటి ఎడిటర్ పనిచేసినప్పటికీ ఆడియెన్స్‌ను అడ్వాన్స్‌గా ఎట్రాక్ట్ చేయడంలో 'కెఆర్‌కె' ఫెయిలైందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. విడుదలలో జాప్యం జరగడంతో పాటు, సరైన ప్రమోషన్ లేకపోవడం కూడా తెలుగు వెర్షన్‌పై కనీస క్రేజ్ రాలేదనేది ఆ వర్గాల మాట. ఇక సినిమా ఆడటం అనేది చూసిన ఆడియెన్స్ మౌత్ టాక్ మీదే ఆధారపడి ఉంది.
![]() |
![]() |