![]() |
![]() |

'జనతా గ్యారేజ్' (2016) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 'జనతా గ్యారేజ్'లో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ పాత్ర ఎంత శక్తిమంతంగా ఉంటుందో.. అంతే పవర్‌ఫుల్‌గా ఇందులో మమ్ముట్టి పాత్ర ఉంటుందని సమాచారం. త్వరలోనే 'ఎన్టీఆర్ 30'లో మమ్ముట్టి ఎంట్రీపై క్లారిటీ రానుంది. 2022 ఏప్రిల్ 29న తారక్ - కొరటాల సెకండ్ జాయింట్ వెంచర్‌ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కాగా, ప్రస్తుతం తారక్ చేతిలో 'ఆర్ ఆర్ ఆర్' ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న ఈ పిరియడ్ డ్రామాని దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ పాన్ - ఇండియా మూవీని అక్టోబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక కొరటాల శివ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి కాంబోలో 'ఆచార్య'ని చేస్తున్నారు. ఈ సినిమా కూడా చిత్రీకరణ తుది దశలోనే ఉంది.
![]() |
![]() |