![]() |
![]() |

నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందించిన 'జాతిరత్నాలు' చిత్రంతో దర్శకుడిగా అనుదీప్ కె.వి. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆద్యంతం పొట్టచెక్కలయ్యేలా ఆ సినిమాని అతను తీర్చిదిద్దిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. చిన్నచిత్రాల్లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ అనే కీర్తిని సైతం ఆ సినిమా దక్కించుకుంది. దాంతో 'జాతిరత్నాలు'కు సీక్వెల్ చేసే పనిలో పడ్డాడు అనుదీప్.
కాగా లేటెస్ట్‌గా అతను ఓ కాలీవుడ్ స్టార్‌తో సినిమా చేయనున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. తమిళంలో శివకార్తికేయన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. 'రెమో' లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం అతను దగ్గరయ్యాడు. ఇప్పుడతను అనుదీప్ చెప్పిన కథను ఓకే చేశాడని వినిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా నిర్మాణమవనుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి. అధినేతలు నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
వారు 'లవ్ స్టోరి' తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్‌తో ఓ పాన్-ఇండియా మూవీని ఇప్పటికే ప్లాన్ చేశారు. దాంతో పాటు శివకార్తికేయన్ - అనుదీప్ మూవీని కూడా వారు నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |