![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో చిత్రసీమ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. ఇదివరకు బాలీవుడ్ మెగాస్టార్‌గా పిలుచుకొనే అమితాబ్ బచ్చన్‌కు కొవిడ్ 19 సోకినప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఎలా ఆందోళనకు గురయ్యారో, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా అలాంటి ఆందోళనకు గురవుతున్నారు. అయితే చిరంజీవికి కొవిడ్ లక్షణాలు లేకపోవడం ఊరట కలిగించే అంశం.
కాగా రెండు రోజుల క్రితం అంటే నవంబర్ 7న ముఖ్యమంత్రిని కేసీఆర్‌ను ఆయన కలవడం, అంతకు మూడు రోజుల ముందు, నవంబర్ 4న సంగీత దర్శకుడు రఘు కుంచే కుమార్తె వివాహానికి హాజరు కావడంతో ఇటు టీఆర్ఎస్ శ్రేణులు, అటు రఘు కుంచే కుమార్తె వివాహానికి హాజరై, చిరుతో సన్నిహితంగా మెలిగిన వారంతో ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. ఆశిష్ వర్మతో జరిగిన రఘు కుంచే కుమార్తె రాగపుష్యమి వివాహానికి సంగీత కళాకారులు పలువురు హాజరయ్యారు. వారిలో కోటి, ఆర్పీ పట్నాయక్, మనో లాంటి వాళ్లతో పాటు డైరెక్టర్ వి.వి. వినాయక్, రైటర్-డైరెక్టర్ బీవీఎస్ రవి లాంటి వాళ్లున్నారు.
ఈ వేడుకకు వచ్చినప్పుడు చిరంజీవి మాస్క్ వేసుకొని ఉన్నారు. ఆ తర్వాత మాస్క్ తీసేశారు. ఈ సందర్భంగా ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. ఈ వివాహ వేడుకకు వచ్చినప్పుడే చిరంజీవికి కొవిడ్ 19 సోకిందా లేక ఆ వేడుకలో హాజరైన ఎవరి నుంచైనా ఆయనకు ఆ వైరస్ సోకి ఉంటుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అప్పటికే ఆయనకు కరోనా వైరస్ సోకినట్లయితే, ఆ వేడుకలో ఆయనకు దగ్గరగా మెలిగిన వాళ్లంతా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఆఖరుకి వధువు రాగపుష్యమితోనూ చిరంజీవి విడిగా ఫొటో దిగారు. ఏదేమైనా రాగపుష్యమి వివాహానికి హాజరైన వారు టెస్ట్ చేయించుకుంటేనే కానీ ఏ విషయమూ వెల్లడి కాదు.


![]() |
![]() |