![]() |
![]() |
రెబల్‌స్టార్ కృష్ణంరాజు కుటుంబంలో మర్యాదలు ఎలా ఉంటాయో ఇంతకుముందు సినిమా ఇండస్ట్రీలోని వారికే ఎక్కువగా తెలిసేవి. కృష్ణంరాజు చనిపోయిన సమయంలో అంత బాధలో ఉండి కూడా పెదనాన్న కోసం వచ్చిన అభిమానుల్ని ప్రభాస్ ఎంత బాగా చూసుకున్నాడో అందరూ ప్రత్యక్షంగా చూసారు. ఆ తర్వాత మొగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని కూడా ఎంత భారీగా నిర్వహించారో అందరూ గమనించారు. ఎదుటివారిని తమ ఆతిథ్యంతో ఉక్కిరి బిక్కిరి చేసే తత్వం పెదనాన్న నుంచి వారసత్వంగా తీసుకున్న ప్రభాస్ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ మరోసారి ప్రేక్షకుల దృష్టికి తీసుకొచ్చారు.
ప్రభాస్ తోటి నటీనటుల్ని ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా ఆదరిస్తారో మనం వింటూనే ఉన్నాం. దాన్ని తాను ప్రత్యక్షంగా అనుభవించానని హీరో పృథ్విరాజ్ ఇటీవల వెల్లడిరచాడు. ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యాన్ని భరించడం చాలా కష్టమని ఆయన అన్నారు. ప్రభాస్‌కి కనెక్ట్ అయితే ఫుడ్ పెట్టి చంపేస్తాడని, అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని పృథ్తిరాజ్ చెబుతున్నారు. ‘సలార్’ షూటింగ్ జరుగుతున్న సమయంలో తన భార్య, కూతురు హైదరాబాద్ వచ్చారని, అప్పుడు వారికి ఏది ఇష్టమని అడిగిన ప్రభాస్ అవన్నీ వెంటనే తెప్పించాడని, వాటిని ఉంచడానికి ఒక రూమ్ అదనంగా తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. ప్రభాస్ పక్కన ఉంటే డైటింగ్ చేయడం చాలా కష్టమని అంటున్నాడు పృథ్వి. భోజనం టైమ్‌లో తమతో పాటే కూర్చున్నా ఓ చిన్న కప్పులో ఏదో తింటూ ఉంటాడు తప్ప ఎక్కువగా తీసుకోడని తెలిపాడు. కేవలం ఫుడ్ విషయంలోనే కాదు, ఎన్నో విషయాల్లో తన తోటివారి కోసం ఎంతో కేర్ తీసుకుంటారని చెబుతున్నాడు. అంతేకాదు, పృథ్విరాజ్‌కి కార్లంటే చాలా ఇష్టం. తన దగ్గర ఉన్న లాంబోర్గిని కారును కొన్నాళ్ళు వాడుకోమని ప్రభాస్ అతనికి ఇచ్చాడట. ఇవన్నీ వింటుంటే.. ప్రభాస్‌లాంటి హీరో ఏ ఇండస్ట్రీలోనూ ఉండరేమో అనిపిస్తోంది కదూ!
![]() |
![]() |