![]() |
![]() |

ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాలలో ఉత్తమ చిత్రం అంటే ఎక్కువ మంది చెప్పే పేరు 'బలగం' అనడంలో సందేహం లేదు. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ప్రేక్షకుల మెప్పు పొంది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.
కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి 'బలగం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా వచ్చేవరకు వేణులో ఇంత మంచి కథకుడు, దర్శకుడు ఉన్నాడని ఎవరూ అంచనా వేయలేకపోయారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించినప్పటికీ.. ప్రియదర్శి మినహా మిగతా అంతా దాదాపు నూతన నటీనటులు కావడం, బడ్జెట్ కూడా తక్కువ కావడంతో విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా మౌత్ టాక్ తోనే రోజురోజుకి వసూళ్లను పెంచుకుంది. కేవలం కోటి రూపాయల బిజినెస్ చేసిన ఈ మూవీ.. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో ఏకంగా రూ.12 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం విజయం సాధించింది.
దర్శకుడు వేణు తన మొదటి సినిమాకి తెలంగాణ పల్లె మట్టి నుంచి పుట్టిన కుటుంబ కథను ఎంచుకున్నాడు. చావు చుట్టూ కథని అల్లుకున్నప్పటికీ, దానికి వినోదాన్ని జోడించి.. నవ్విస్తూనే ఏడిపిస్తూ బంధం విలువ, బలగం విలువని చాటిచెప్పాడు. ఈ సినిమా చూసి చాలా ఏళ్లకు కలిసిపోయిన తోబుట్టువులు ఎందరో ఉన్నారు. తెలంగాణలోని పలు పల్లెల్లో తెరలు కట్టి బలగం సినిమాని ప్రదర్శించారంటే.. ఎంతలా ఈ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే 2023 ఉత్తమ తెలుగు చిత్రం అంటే ఎక్కువ మంది నుంచి వినిపించే పేరు బలగం.
![]() |
![]() |