![]() |
![]() |
.jpg)
కన్నడ నటి ప్రేమ తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకొని, ఇక్కడ కూడా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ధర్మచక్రం, జగదేకవీరుడు, కోరుకున్న ప్రియుడు, ఓంకారం, మా ఆవిడ కలెక్టర్, దేవి, అమ్మో ఒకటో తారీఖు, రాయలసీమ రామన్న చౌదరి, చిరునవ్వుతో లాంటి సినిమాలు ప్రేమను ప్రేక్షకులకు సన్నిహితం చేశాయి. ఆ తర్వాత ఆమెకు తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో ఎక్కువగా మాతృభాషలోనే సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
2007లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'ఢీ'లో ఆమె హీరోయిన్ జెనీలియా వదినగా, శ్రీహరి భార్య పాత్రను చేసింది. అయితే ఆ పాత్రను ఆమె ఇష్టం లేకుండానే చేసింది. అప్పటిదాకా తెలుగులో హీరోయిన్ పాత్రలో, లేదా కథకు కీలకమైన పాత్రలో చేస్తూ వచ్చిన ఆమెకు, ఆ సినిమాలో అంత కీలకం కాని వదిన పాత్ర చేయడం ఎందుకనో మనసుకు కష్టమనిపించింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పింది.
"మంచి టఫ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన నేను అత్త లేదా అమ్మ క్యారెక్టర్ చేస్తే నాకు శాటిస్‌ఫ్యాక్షన్ ఉండదు. 'ఢీ'లో నటించేటప్పుడు శ్రీహరితో 'ఈ క్యారెక్టర్ చేస్తుంటే నాకు హ్యాపీగా లేదు. ఇబ్బందిగా అనిపిస్తోంది' అని చెప్పాను. ఆయన మౌనంగా విన్నారు. ఆ క్యారెక్టర్ చేసేటప్పుడే నేను డిసైడ్ చేసుకున్నా.. నాకు బ్రేక్ కావాలి.. అని. 'దేవి', 'కోరుకున్న ప్రియుడు' సినిమాల్లో నేను చేసింది మంచి పాత్రలు. అలాంటివి చేస్తూ, ఇలాంటి క్యారెక్టర్ చేయడం నాకెందుకో బాధగా అనిపించింది. ఆర్టిస్టుగా శాటిస్‌ఫ్యాక్షన్ ఇచ్చే పాత్రలు చెయ్యాలని బ్రేక్ తీసుకున్నా. అంతేకానీ మ్యారేజ్ అయ్యింది కాబట్టి ఇక నటించకూడదని అనుకోలేదు." అని ఆమె తెలిపింది.
'ఢీ' సినిమా చేసే సమయంలోనే ఆమె 2006లో అప్పచు అనే బిజినెస్‌మ్యాన్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. అయితే సంసారంలో కలహాలు చెలరేగడంతో 2016 మార్చిలో విడాకుల కోసం బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసిందామె.
![]() |
![]() |