![]() |
![]() |
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన తొలి కాస్ట్యూమ్ డ్రామా, తొలి పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుంచీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు మొదట క్రిష్ జాగర్లమూడి డైరెక్టర్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో వాయిదాల మధ్య ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయింది. అయితే సినిమాపై ఏర్పడ్డ భారీ అంచనాలను చేరుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని అధికారికంగా ప్రకటించారు. అయితే మొదటి భాగానికి ఆశించిన ఫలితం రాకపోవడంతో సీక్వెల్ చేస్తారా లేదా అనే సందేహం అందరిలోనూ ఉంది.
2015లో ‘బాహుబలి’ చిత్రం రిలీజ్ అయినపుడు కూడా ప్రేక్షకులు ఇలాంటి అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. సినిమాకి చేసిన భారీ ప్రమోషన్స్ వల్ల అంచనాలు కూడా భారీగానే ఏర్పడ్డాయి. రిలీజ్ అయిన తర్వాత సినిమా అసంపూర్తిగా ఉందనే భావన ప్రేక్షకులకు కలిగింది. దీనికి సెకండ్ పార్ట్ చెయ్యడం అనవసరం అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే హరిహర వీరమల్లు చిత్రానికి వచ్చినంత బ్యాడ్ టాక్ బాహుబలికి రాలేదు. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ప్రేక్షకుల నుంచి, ఇండస్ట్రీ నుంచి వస్తున్న కామెంట్స్‌ని పట్టించుకోకుండా సెకండ్ పార్ట్‌ని ఎంతో కాన్ఫిడెంట్‌గా తెరకెక్కించారు రాజమౌళి. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘బాహుబలి2’ ఇండియాలోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని మొదట డైరెక్ట్ చేసిన క్రిష్ జాగర్లమూడి ఇటీవల ‘ఘాటి’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో సీక్వెల్ ప్రస్తావన తీసుకొచ్చారు. తాను తెరకెక్కించిన ఎక్కువ సన్నివేశాలు ఢల్లీి దర్బార్ నేపథ్యంలోనే జరుగుతాయని, దాని కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా సెట్ వేసి వాటిని తీశామని చెప్పారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక ఛాండెలియర్‌పై జరిగే ఫైట్ సీక్వెన్స్‌లో అద్భుతంగా యాక్ట్ చేశారని చెప్పారు. అయితే ఇది పార్ట్ 1లో లేదని, దీనికి సంబంధించిన 40 నిమిషాల ఫుటేజ్ సెకండ్ పార్ట్ కోసం సిద్ధం చేసి ఉంచామని చెప్పారు.
క్రిష్ చెప్పిన దాన్నిబట్టి చూస్తే.. సెకండ్ పార్ట్ కోసం 40 నిమిషాల కంటే ఎక్కువ ఫుటేజ్ ఉండి ఉండొచ్చు అనిపిస్తుంది. బాహుబలి విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి సెకండ్ పార్ట్‌కి సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తయిందని అప్పుడు ప్రకటించారు. బాహుబలి రెండో భాగం తెరకెక్కిన తీరును గమనిస్తే.. హరిహర వీరమల్లు చిత్రానికి కూడా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొదటి పార్ట్ ప్రేక్షకుల్ని నిరాశపరిచినా కంటెంట్ పరంగా రెండో పార్ట్ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని అభిమానులు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. ‘హరిహర వీరమల్లు’ సెకండ్ పార్ట్‌ని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
![]() |
![]() |