![]() |
![]() |

వెండితెరపై మనకు తాగుబోతు అనగానే మొదట గుర్తుకొచ్చేది ఎమ్మెస్ నారాయణ. అనేక తాగుబోతు పాత్రలతో ఆయన ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన తర్వాత తాగుబోతుగా తెరపై రాణిస్తూ వస్తున్నాడు తాగుబోతు రమేశ్. తాగుబోతు అనేమాటను ఇంటిపేరుగా చేసేసుకునేంతగా అతను ఆ తరహా పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. నిలువెల్లా ఊగిపోతూ, ముద్దముద్దగా మాట్లాడుతూ నిజంగా తాగొచ్చి యాక్ట్ చేస్తున్నాడా అనే భ్రమను కల్పిస్తుంటాడు రమేశ్. ఆశ్చర్యకరంగా అనిపించినా, అతనసలు తాగుబోతు కాదు. నిజ జీవితంలో ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకొని ఎరగడు!
రమేశ్‌కు సంబంధించిన ఇంకో విషయం.. అతను హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయలేదు! సుకుమార్ సినిమా 'నాన్నకు ప్రేమతో' మూవీలో మనకు లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా దర్శనమిచ్చి, నిజంగా అతను సాఫ్ట్‌వేర్ ఇంజనీరేమో అనిపించేట్లు నటించిన రమేశ్.. ఇంటర్వ్యూలలో అడిగితే "టెన్త్ వరకూ.." అని అర్ధోక్తితో ఆపేస్తుంటాడు. కానీ అతను చదువుకుంది ఏడో తరగతి వరకే.
రమేశ్ చిన్నతనంలో వాళ్లింటి పక్కనే స్కూల్ ఉండేది. ఆరో తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. గోదావరి ఖనిలో జిల్లా ప్రజాపరిషత్ స్కూల్‌లో ఏడో తరగతి జాయిన్ అవడానికి వెళ్తే.. "అలా కుదరదు.. ఆరు నుంచి చదవాల్సిందే" అన్నారు. దాంతో అక్కడ ఆరో తరగతిలో చేరాడు. అంటే ఆ క్లాసును రెండు సార్లు చదివాడన్న మాట. ఏడో తరగతి చదివాక.. ఇంక చదువు తనకు వర్కవుట్ కాదనిపించించి, అంతటితో ఆపేశాడు. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు రమేశ్.
![]() |
![]() |