![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు సంబరం చేకూర్చేలా 'ఆచార్య' టీజర్ వచ్చేసింది. ఎన్నాళ్లనుంచే ఈ సినిమా మేకింగ్‌లో ఉన్నప్పటికీ ఆ సినిమా ఎలా రూపొందుతోందనే విషయం తెలియకపోవడంతో ఫ్యాన్స్ అంతా చాలా అసంతృప్తిగా ఉన్నారు. కొత్త సంవత్సరం వచ్చినా, సంక్రాంతి పోయినా, రిపబ్లిక్ డే వచ్చినా కూడా ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడం వారిని తీవ్రంగా నిరుత్సాహపరిచింది. దీంతో రిపబ్లిక్ డే నాడే టీజర్ జనవరి 29 సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ అవుతుందని మెగాస్టార్‌కు హామీ ఇచ్చాడు డైరెక్టర్ కొరటాల శివ. మాట నిలబెట్టకుంటూ చెప్పిన టైమ్‌కే టీజర్‌ను తీసుకువచ్చారు. నిమిషం మీద కాస్త ఎక్కువ నిడివి ఉన్న ఈ టీజర్ కొరటాల మార్క్‌ను మరోసారి రుచి చూపించింది.
వరుణ్‌తేజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా లీక్ చేసింది నిజమే అయ్యింది. టీజర్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తోటే మొదలైంది. "ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే, ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు." అంటూ రామ్‌చరణ్ వాయిస్ బ్యాగ్రౌండ్‌లో వినిపించడం పూర్తయిన వెంటనే ఆచార్య టైటిల్ పాత్రధారి చిరంజీవి స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యారు. దుండగులను తనచేతిలోని చురకత్తితో దునుమాడారు. ఫెరోషియస్ లుక్స్‌తో, రోమాలు నిక్కబొడుచుకొనే యాక్షన్ సీక్వెన్స్‌తో ఆయన అదరగొట్టారు. కాళికాదేవి ముందు త్రిశూలంతో ఒక రౌడీని చంపే సీన్ అయితే ఒళ్లు జలదరింపజేసేట్లు ఉంది.
"పాఠాలుచెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారో?.. బహుశా గుణపాఠాలు చెప్తుంటాననేమో.." అనే డైలాగ్‌తో తన క్యారెక్టరైజేషన్ ఏమిటో చిరంజీవి హింట్ ఇచ్చారు. మెగాస్టార్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడమే కాకుండా, తనలోని నటుడిని మరింత వెలికితీసే పాత్రలో ఆయన కనిపించనున్నారు.
'ఆచార్య' కథకు కేంద్రబిందువు ధర్మస్థలి అనే ప్రాంతం. ఆ పవిత్ర స్థలంలో సాధువుల్లాగా జీవించే వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని అర్థమవుతోంది. వారిని కాపాడ్డం కోసం ఆచార్య అని అందరూ పిలుచుకొనే వ్యక్తి వచ్చాడనీ, ఆయన వెనుక ఏదో కథ ఉందనీ టీజర్‌ని బట్టి ఊహించవచ్చు. ఈ టీజర్‌లో విలన్‌ను కానీ, రామ్‌చరణ్ క్యారెక్టర్‌ను కానీ చూపించలేదు. యాక్టర్ అజయ్ మాత్రం కనిపించాడు. అతడిని విలన్ల గ్యాంగ్ పొడవడం కనిపించింది. ధర్మస్థలికి, ఆచార్యకు కనెక్షన్ ఏమిటనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
మణిశర్మ మనసుపెట్టి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తే ఎలా ఉంటుందంటే.. ఇదిగో 'ఆచార్య' టీజర్‌కు ఇచ్చిన బీజియంలా ఉంటుందని ఇట్టే చెప్పవచ్చు. నో డౌట్.. మణిశర్మ ఈజ్ బ్యాక్! అలాగే తిరు సినిమాటోగ్రఫీ కూడా అమేజింగ్ అనిపించేలా ఉంది. టీజర్‌లో చూపించిన ప్రతి షాట్ అతని కెమెరా పనితనానికి మెచ్చుతునకలే. ధర్మస్థలిని టాప్ యాంగిల్‌లో చూపించిన తీరు కానీ, ఆచార్య ఇంట్రడక్షన్ షాట్ కానీ, నీటిలోంచి ఆయన కాలు బయటకు వచ్చే షాట్ కానీ, ఒక దుష్టుడిని పైకెత్తి వెనుక ఉన్న త్రిశూలానికి గుచ్చే షాట్ కానీ.. సూపర్బ్ అంతే!
'ఆచార్య'తో కొరటాల శివ మరో బ్లాక్‌బస్టర్‌కు రెడీ అవుతున్నాడని చెప్పడానికి ఈ టీజర్ ఓ శాంపిల్. 'భరత్ అనే నేను' తీసిన మూడేళ్ల తర్వాత అతని నుంచి వస్తోన్న సినిమా ఇది. ప్రతిసారీ తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీస్తూ వస్తున్న కొరటాల ఆ ఆనవాయితీని 'ఆచార్య'తోనూ కొనసాగిస్తాడని ఆశించవచ్చు.
చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న ఈ మూవీలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సమ్మర్‌లోనే ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు ఆచార్య ఉరకలేస్తున్నాడు.
![]() |
![]() |