![]() |
![]() |

2022 సంక్రాంతిని ఏడాది ముందుగానే బుక్ చేసుకున్నాడు సూపర్‌స్టార్ మహేశ్. అవును. ఆయన హీరోగా నటిస్తోన్న 'సర్కారు వారి పాట' వచ్చే ఏడాదికి సంక్రాంతికి విడుదల కానున్నది. ఈ విషయాన్ని శుక్రవారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆయన వెల్లడించాడు. సంక్రాంతి 2022కి సినిమా వస్తున్నట్లు ఓ పోస్టర్ ద్వారా షేర్ చేశాడు. ఆ పోస్టర్‌లో మహేశ్ ముఖం కనిపించడం లేదు. ఆయన కుడి చేయి మాత్రం కనిపిస్తోంది. ఆ చేతిలో తాళం చెవుల గుత్తి ఉంది. ఆ చేతి మణికట్టు దగ్గర తాయెత్తు దారాలు, రిస్ట్ బ్యాండ్లు చాలానే కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఆయన క్యారెక్టర్ ఏమిటనే ఆసక్తి పెరిగిపోయింది. ఆ పోస్టర్‌కు "Sankranthi it is!!! #SarkaruVaariPaata" అనే క్యాప్షన్ జోడించాడు మహేశ్.
నిన్నటి నుంచీ ఒకదాని తర్వాత ఒకటిగా సినిమా రిలీజ్ డేట్లు రివీల్ అవుతూ వస్తున్నాయి. పుప్ప, గని, సీటీమార్, ఎఫ్ 3 సినిమాల రిలీజ్ డేట్స్ నిన్ననే వెల్లడయ్యాయి. దాంతో తాము కూడా ముందుగానే సంక్రాంతిని బుక్ చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో 2022 సంక్రాంతికి 'సర్కారువారి పాట'ను తీసుకొస్తున్నట్లు ప్రకటించారని అనుకోవాలి. కానీ 2021లోనే ఈ సినిమా తమ ముందుకు వస్తుందని ఆశించిన మహేశ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వారు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం మరో సంక్రాంతి బ్లాక్‌బస్టర్ గ్యారంటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా 'సరిలేరు నీకెవ్వరు' వచ్చిన రెండేళ్లకు 'సర్కారువారి పాట' వస్తుందనేది ఖాయమైంది. 'సరిలేరు నీకెవ్వరు' 2020 సంక్రాంతికి వచ్చిన విషయం తెలిసిందే.
పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న 'సర్కారువారి పాట'లో మహేశ్ జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది. జనవరి 25నే దీని షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది. అంటే షూటింగ్ స్టార్టయిన ఏడాదికి సినిమా విడుదల అవుతుందన్న మాట. ఈ లెక్కన షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్ దాకా నడుస్తుందని ఊహించుకోవచ్చు.
తమన్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఆర్. మది సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

![]() |
![]() |