![]() |
![]() |

అక్కినేని ఇంటి కోడలు సమంత 'ద ఫ్యామిలీ మ్యాన్' సెకండ్ సీజన్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి కపుల్‌గా నటించిన ఆ సిరీస్‌లో ఒక డెడ్లీ క్యారెక్టర్‌లో సమంత కనిపించనున్నారు. ఆ సిరీస్ షూటింగ్ 2019 నవంబర్‌లోనే స్టార్ అయ్యింది. ఈ పాటికే సెకండ్ సీజన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవ్వాల్సింది. కానీ డిసెంబర్‌కు వాయిదా పడింది. ఈలోగా మరో ప్లాట్‌ఫామ్‌తో మరో విధంగా ఎంట్రీ ఇచ్చేందుకు సమంత రెడీ అయిపోయారు. అది.. ఒక సెలబ్రిటీ టాక్ షో హోస్ట్‌గా. 'సామ్ జామ్' పేరుతో నడిచే ఈ షో ఓటీటీలో నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవనున్నది.
సమంత కెరీర్‌ను వివాహానికి ముందు, వివాహం తర్వాత అని డివైడ్ చేసి చెప్పాలి. అదివరకు కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే చేస్తూ హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. నాగచైతన్యతో వివాహం తర్వాత తన పరిధిని విస్తరించుకుంటూ వస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ ఫిలిమ్స్‌తో పాటు, కంటెంట్ రిచ్ ఫిలిమ్స్ చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. మజిలీ, సూపర్ డీలక్స్, ఓ బేబీ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఆ తర్వాత డిజిటల్ వరల్డ్‌లోకి అడుగుపెట్టి మొదట రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తోన్న 'ది ఫ్యామిలీ మ్యాన్' సెకండ్ సీజన్‌లో ఒక కీలక పాత్ర చేశారు.
మామయ్య నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 4కు ఆయన గైర్హాజరీలో దసరా స్పెషల్ ఎపిసోడ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు సమంత. ఇప్పుడు 'సామ్ జామ్' అనే సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ టాక్ షోలో ఆమె సినీ, స్పోర్ట్స్, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తారు. అయితే ఆమె ఏ భాషలో ఇంటర్వ్యూ చేస్తారన్నది ఆసక్తికరం. సమంతకు తెలుగు వచ్చినప్పటికీ, బ్రోకెన్ ఇంగ్లీష్ లాగా ఆమె మాట్లాడే తెలుగును బ్రోకెన్ తెలుగు అనొచ్చు. తెలుగులో అంత ధారాళంగా మాట్లాడ్డం ఆమెకు అలవడ లేదు. పట్టి పట్టి మాట్లాడతారు. బిగ్ బాస్ 4లో ఒక ఎపిసోడ్‌లోనే ఆ విషయం మనకు అర్థమైంది. కాబట్టి 'సామ్ జామ్'లో ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే ఆమె సెలబ్రిటీలను ప్రశ్నలు అడుగుతారని ఊహించవచ్చు. ఈ కొత్త రోల్‌లో ఆమె ఎంతవరకు సూటవుతారో, వీక్షకులు ఆమెనే ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.
![]() |
![]() |