![]() |
![]() |

మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమా హాస్యానికి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే బ్రహ్మానందంలో గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప చిత్రకారుడు కూడా ఉన్నాడు. లెక్చరర్ నుంచి సినీ నటుడిగా మారక ముందు నుంచే ఆయన చిత్రకారుడు. అయితే చిత్రకళ ఒక హాబీగా మాత్రమే ఉంటూ వచ్చింది. నటుడిగా మహా బిజీగా మారడంతో ఆయనలోని చిత్రకారుడు నిద్రలో ఉండిపోయాడు. కొంత కాలంగా టాలీవుడ్‌లోకి కొత్త రక్తం రావడం, యంగ్ కమెడియన్స్ హవా మొదలవడంతో ఆయనకు ఇదివరకుండే డిమాండ్ ఇప్పుడు లేదనేది వాస్తవం.
దీంతో తనలోని చిత్రకళకు బ్రహ్మానందం మరింత పదునుపెడుతూ వచ్చారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో షూటింగ్‌లు బందైపోవడంతో ఒక రకంగా ఆయనకు మేలు చేసింది. నటుడి స్థానంలో చిత్రకారుడు ఒళ్లు విరుచుకున్నాడు. ఆయన చేతిలోని పెన్సిల్ బిజీ అయిపోయింది. అవును. బ్రహ్మానందం కుంచె చిత్రకారుడు కాదు.. పెన్సిల్ చిత్రకారుడు. ఒక పెన్సిల్‌తోటే ఆయన బొమ్మలు గీస్తూ వస్తున్నారు. దేవుళ్లు, జాతీయ నాయకులు, కవులు, కళాకారులు, మహనీయులు ఆయన పెన్సిల్ నుంచి ప్రాణం పోసుకున్నారు.
ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా యువ కథానాయకులు అల్లు అర్జున్, రానా దగ్గుబాటిలకు తను గీచిన బొమ్మలను కానుకలుగా పంపారు బ్రహ్మానందం. వాటిని అందుకున్న ఆ హీరోలు బ్రహ్మానందభరితులయ్యారు. రానాకు వేంకటేశ్వరస్వామిని భక్తితో పూజిస్తున్న పూజారి బొమ్మను ఫ్రేమ్ కట్టించి పంపారు హాస్య నటచక్రవర్తి. దానికి "నా గీత గోవిందుడు" అనే పేరు పెట్టారు. ఆ పటాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు రానా. దాంతో పాటు, "బ్రహ్మానందం గారి నుంచి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్‌ను అందుకున్నాను! థాంక్యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సర్! మా తాత (ఉన్నట్లయితే) దీనిని ఇష్టపడేవారు." అని రాశాడు.

అల్లు అర్జున్‌కు ఇదే పటాన్ని బ్రహ్మానందం పంపారు. దాంతో పాటు ఆ బొమ్మతో ముద్రించిన క్యాలెండర్‌ను కూడా పంపారు. ఆ క్యాలెండర్‌లో కింద ఇరువైపులా ఆ బొమ్మను గీస్తున్న తన పిక్చర్‌ను కూడా ఆయన ముద్రించారు. వాటిని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన బన్నీ, "మనం ప్రేమించే బ్రహ్మానందం గారి నుంచి నేను అందుకున్న అమూల్యమైన కానుక ఇది. 45 రోజుల పనితనం. చేతి పెన్సిల్‌తో గీచిన బొమ్మ. థాంక్యూ" అని రాశాడు.

బ్రహ్మానందంలోని ప్రతిభావంతుడైన చిత్రకారుడిని చూసి, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు ఈ చిత్రకళ కూడా నిదర్శనమని ప్రశంసిస్తున్నారు.
![]() |
![]() |