![]() |
![]() |

యాక్షన్ చిత్రాల కథానాయకుడు గోపీచంద్ హిట్ చూసి చాలా కాలమైంది. ‘లౌక్యం’ (2014) తరువాత గోపీచంద్ నటించిన సినిమాలేవీ ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో.. తన తాజా చిత్రం ‘సీటీమార్’ పైనే ఆశలు పెట్టుకున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా.. దాదాపు సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌కి సిద్ధమవుతోంది. తమన్నా, దిగంగన సూర్యవంశీ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో.. నిన్నటితరం కథానాయిక భూమికా చావ్లా కబడ్డీ కోచ్ పాత్రధారి అయిన గోపీచంద్‌కి అక్కగా దర్శనమివ్వనుంది.
ప్రస్తావించదగ్గ విషయం ఏమంటే.. ఇప్పటివరకు భూమిక నటించిన స్పోర్ట్స్ డ్రామాలన్నీ మంచి విజయం సాధించాయి. భూమిక తొలి తమిళ చిత్రం ‘బద్రి’ (‘తమ్ముడు’కి రీమేక్) కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందితే.. తెలుగు చిత్రం ‘ఒక్కడు’ కబడ్డీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కింది. ఈ రెండు సినిమాల్లోనూ కథానాయికగా కనిపించింది భూమిక. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం తరువాత 2016లో విడుదలైన హిందీ చిత్రం ‘యం.యస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో కీలక పాత్ర పోషించింది. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ధోని అక్క పాత్రలో నటించింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ఈ మూడు స్పోర్ట్స్ డ్రామాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాగే ఈ మూడు చిత్రాల్లోనూ కథానాయకుడి లక్ష్యానికి దోహదపడే పాత్రల్లో భూమిక అభినయించడం విశేషం. మరి.. ‘సీటీమార్’కి కూడా భూమిక సెంటిమెంట్ కలిసొచ్చి.. చాన్నాళ్ళుగా విజయం కోసం వేచి చూస్తున్న గోపీచంద్‌కి ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.
కొసమెరుపు ఏమిటంటే.. భూమిక కథానాయికగా నటించిన కబడ్డీ బ్యాక్ డ్రాప్ మూవీ ‘ఒక్కడు’కి సంగీతం అందించిన మణిశర్మ.. ఇప్పుడు భూమిక అక్క పాత్రలో నటిస్తున్న మరో కబడ్డీ నేపథ్య చిత్రం ‘సీటీమార్’కి కూడా బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |