![]() |
![]() |

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందాల్సిన నాలుగో సినిమా అధిక బడ్జెట్ కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత వీరి కాంబోలో ప్రకటించిన క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇప్పుడు ఇదే బాటలో మరో క్రేజీ ప్రాజెక్ట్ పయనిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విజయ్ దేవరకొండ తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ తన 13వ సినిమా 'ఫ్యామిలీ స్టార్' షూటింగ్ తో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. 'ఫ్యామిలీ స్టార్' పూర్తయ్యాక విజయ్ తన పూర్తి ఫోకస్ 'VD 12'పై పెట్టనున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని అధిక బడ్జెట్ కారణంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పూర్తిగా నిలిపివేసే ఆలోచనలో ఉందని ప్రచారం మొదలైంది.

ఇటీవల సితార మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన 'గుంటూరు కారం' విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కావడంతో దీని కోసం భారీగానే ఖర్చు పెట్టారు. కానీ ఆ ఖర్చుకు తగ్గ ప్రతిఫలం కనిపించడంలేదు. దీంతో ఇప్పటికే ప్రకటించిన పలు ప్రాజెక్ట్ ల బడ్జెట్ విషయంలో సితార పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొదట ఫోకస్ 'VD 12'పై పడినట్లు సమాచారం. షూటింగ్ ఆలస్యమవ్వడం, నటీనటుల డేట్స్ సమస్య ఏర్పడటం, బడ్జెట్ పెరుగుతుండటంతో.. అసలు పూర్తిగా 'VD 12'ని ఆపేయాలని సితార సంస్థ భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
'VD 12' ఆగిపోయిందనే వార్తలతో విజయ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించి, ఇలా బడ్జెట్ ఇష్యూస్ అంటూ నిలిపివేయడం ఏంటంటూ సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సన్నిహిత వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని తిప్పి కొడుతున్నాయి. 'VD 12' ఆగిపోయిందన్న వార్తల్లో నిజం లేదని అంటున్నారు. 'ఫ్యామిలీ స్టార్' షూటింగ్ పూర్తయిన వెంటనే 'VD 12' షూటింగ్ రీస్టార్ట్ అవుతుందని, మార్చి మొదటి వారం నుండి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నామని చెబుతున్నారు.
![]() |
![]() |