![]() |
![]() |
40 సంవత్సరాల ముందు నుంచీ ప్రతి ఏడాది సినిమాల సంఖ్యలో దేశంలోనే టాలీవుడ్ పైచేయిగా ఉండేది. ప్రతి సంవత్సరం తెలుగులో నిర్మించినన్ని సినిమాలు ఇండియాలోని ఏ భాషలోనూ నిర్మించేవారు కాదు. సినిమాల సక్సెస్ రేట్ చూస్తే బాలీవుడ్ ఎప్పుడూ పైచేయిగా ఉండేది. అయితే ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. టాలీవుడ్ అందర్నీ కమాండ్ చేసే స్థాయికి ఎదిగింది. కంటెంట్‌పరంగా, సాంకేతికంగా తెలుగు సినిమాకి దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల వారు నీరాజనాలు పడుతున్నారు. తెలుగులో ఒక భారీ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది అంటే దానిపైనే అందరి దృష్టీ ఉంటుంది. తెలుగు సినిమాకి ఇంతటి ఖ్యాతి రావడానికి కారణం ఖచ్చితంగా రాజమౌళి అని చెప్పొచ్చు. దాన్ని కొనసాగిస్తూ సందీప్‌రెడ్డి వంగా ‘యానిమల్’తో మరో సంచలనం సృష్టించాడు. 2023లో రిలీజ్ అయిన బ్లాక్‌బస్టర్ మూవీస్ పఠాన్, జవాన్ తర్వాత అంతటి భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘యానిమల్’ రికార్డు క్రియేట్ చేసింది. రూ.900 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి తెలుగువాడి సత్తా ఏమిటో చూపించింది. హీరో రణబీర్ కపూర్‌కి అతని కెరీర్‌లోనే బెస్ట్ రోల్ ఇచ్చాడు సందీప్. గతంలో ‘కబీర్‌సింగ్’తో షాహిద్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లిన సందీప్ ఈసారి ఆ అవకాశం రణబీర్‌కి ఇచ్చాడు.
రణబీర్, సందీప్ కాంబినేషన్‌లో రూపొందిన ‘యానిమల్’ సినిమా ఇప్పుడు మరో సంచలనం సృష్టించింది. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024లో 19 నామినేషన్లను పొందింది. ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటితోపాటు పలు విభాగాల్లో ‘యానిమల్’ నామినేషన్లు సాధించింది. అరిజిత్ సింగ్, భూపిందర్ బబ్బల్ వరుసగా సత్రాంగ అర్జన్ వైలీ లాంటి చార్ట్ బస్టర్లను ఆలపించగా వారు ఉత్తమ నేపథ్య గాయకులుగా నామినేషన్‌లను పొందారు. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, సురేష్ బండారు ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో పోటీపడనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం నామినేషన్ సంపాదించింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ (అమిత్ రాయ్), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (సురేష్ సెల్వరాజన్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (శీతల్ శర్మ), ఉత్తమ సౌండ్ డిజైన్ (సింక్ సినిమా), ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ యాక్షన్ (సుప్రీమ్ సుందర్), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో నామినేషన్లు పొందారు. నామినేషన్లలోనే తన సత్తా ఏమిటో చూపిస్తున్న ‘యానిమల్’ మూవీకి ఖచ్చితంగా 10కి పైగా అవార్డులు రావడం ఖాయమని బాలీవుడ్ సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
![]() |
![]() |