![]() |
![]() |

బుల్లితెరపై లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న యాంకర్ సుమ.. వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా సుమ సైతం ఓ వీడియో ద్వారా తాను సినిమాలలో నటించబోతున్నట్లు తెలిపారు. ఇక తాజాగా ఆమె నటిస్తున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
సుమ బుధవారం నాడు సోషల్ మీడియాలో తన నటిస్తున్న మూవీ ప్రీలుక్ పోస్టర్ ను షేర్ చేశారు. ఆ పోస్టర్ లో రోలు, రోకలి, సుమ చెయ్యి కనిపిస్తున్నాయి. సుమ చేతిపై 'వెంకన్న' అనే పేరు టాటూ ఉంది. పోస్టర్ ని బట్టి చూస్తుంటే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు విజయ్ కలివరపు దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై గతంలో శ్రీవిష్ణు హీరోగా 'మా అబ్బాయి' సినిమాను నిర్మించిన బలగ ప్రకాష్ ప్రొడక్షన్ నెం.2 గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను నవంబర్ 6న రివీల్ చేయబోతున్నట్లుగా ప్రీలుక్ పోస్టర్ లో తెలిపారు.

దాసరినారాయణరావు దర్శకత్వంలో వచ్చిన 'కళ్యాణ ప్రాప్తిరస్తు' సినిమాతో సుమ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసినా.. బుల్లితెరపై యాంకర్ గా సూపర్ సక్సెస్ సాధించడంతో ఆమె సినిమాలపై అంతగా ఆసక్తి చూపలేదు. మళ్ళీ ఇంతకాలానికి పూర్తిస్థాయి నటిగా రీఎంట్రీ ఇస్తున్న సుమ.. ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
![]() |
![]() |