![]() |
![]() |

అమృత, ఆమెను అమితంగా ప్రేమించి తండ్రి మారుతీరావు కథ ఆధారంగా 'మర్డర్' సినిమా తీస్తున్నానంటూ ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రామ్‌గోపాల్ వర్మపై ఒకవైపు ఆగ్రహాన్నీ, మరోవైపు ఆక్రోశాన్నీ, ఇంకోవైపు ఆవేదననీ వ్యక్తపరుస్తూ అమృత రాసిన లేఖ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ లెటర్‌లో ఆమె బాధ వ్యక్తపరచిని తీరు చూస్తే కరడుకట్టిన హృదయాలు కూడా చెమ్మగిల్లుతాయి. అయితే అవతల ఉన్నది రామ్‌గోపాల్ వర్మ కాబట్టి, అలాంటి స్పందనను మనం ఆయన నుంచి ఊహించలేం. ఇంతకీ అమృత రాసిన లేఖలో ఏముంది? తన ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త ప్రణయ్‌ను తన కళ్లముందే నరికి చంపిన క్షణాల తర్వాత నుంచీ ఆమె ఎలాంటి బాధను అనుభవిస్తూ ఉంది? ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె.. ఆ తర్వాత ఒక మగబిడ్డకు జన్మినిచ్చి.. ఎలాంటి వేదన పొందుతూ ఉంది.. అవన్నీ ఆ లేఖలో మనం చూడొచ్చు. ఆమె ఏం రాసిందంటే...
"నేను మధ్యాహ్నం నిద్రపోతుండగా, తన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్‌లో సోకాల్డ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఒక మెసేజ్ రావడంతో మా అత్తామామలు (ప్రణయ్ తల్లిదండ్రులు) ఒత్తిడికి గురయ్యారు. అది.. దివంగతుడైన నా భర్త ప్రణయ్‌తో నేను ఉన్న ఫొటోగ్రాఫ్, దివంగతుడైన మా నాన్న మారుతీరావు ఫొటోగ్రాఫ్‌తో ఉన్న మెసేజ్.
మా జీవితాల్లో ఈ కొత్త సమస్యను ఎలా డీల్ చేయాలని మా అత్తామామలిద్దరూ వర్రీ అయ్యారు. వాళ్లు నన్ను లేపి, ఆ పోస్ట్ చూపించడానికి ముందు నన్ను కంట్రోల్‌లో ఉండాల్సిందిగా చెప్పారు.
ఆ పోస్ట్ చూశాక, నా మైండ్‌లోకి వచ్చిన మొదటి ఆలోచన ఆత్మహత్య చేసుకోవాలని. నా మొత్తం ప్రపంచం మళ్లీ తలకిందులైనట్లయింది. ఆ బాధను తట్టుకోవడం నా హృదయానికి కష్టమైంది. నా భర్త ప్రణయ్ మర్డర్ జరిగిన రోజు నుంచీ ఇన్ని రోజులుగా, నెలలుగా నా వ్యక్తిత్వాన్నీ, నా జీవితాన్నీ, నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకున్న నా నిర్ణయాన్నీ కించపరుస్తూ వస్తున్న ఈ హృదయంలేని సొసైటీకి వ్యతిరేకంగా ఆత్మగౌరవంతో నా బతుకు నేను బతకడానికి స్ట్రగుల్ అవుతూ వస్తున్నాను.
నాకు అత్యంత సన్నిహితంగా ఉన్న మనుషులకు తప్ప నా స్టోరీ ఎవరికీ తెలీదు.
మా నాన్న తన కులం, తను సంపాదించిన డబ్బు ఇచ్చిన అహంకారంతో ఒక తప్పుడు జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. కాంట్రాక్ట్ కిల్లర్స్ చేత నా భర్తను ఆయన చంపడానికి ఇదే కారణం. నేను గర్భవతిగా ఉన్నప్పుడు పట్టపగలు నా కళ్లముందే వాళ్లు నా భర్తను చంపారు.
న్యాయం కోసం నేను పోరాటం చేస్తూ వచ్చాను. కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాను. ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రసవం తర్వాత మీడియాను ఎదుర్కొన్నాను.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రణయ్ వ్యక్తిత్వాన్నీ, నా వ్యక్తిత్వాన్నీ అనేక మార్గాల్లో చిత్రవధ చేస్తూ జరిగిన తప్పుడు ప్రచారాన్ని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అనేకసార్లు చేను చచ్చిపోయాను.
ప్రతి రోజూ, ప్రతి రాత్రీ నేను భారమైన హృదయాన్ని మోస్తున్నాను. ఈమధ్యే పుట్టిన నా బిడ్డ తన తండ్రి వాల్ సైజ్ ఫొటోగ్రాఫ్ వంక చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆపులేకపోతున్నాను. అతని (ప్రణయ్) వంక బిడ్డ ఎందుకు చూస్తున్నాడో నాకు తెలుసు. నిజ జీవితంలో నా చిన్నారి ఎన్నడూ తన తండ్రిని చూడలేదు. బహుశా ఈ వ్యక్తి తన దగ్గరకు ఎందుకు రావట్లేదని నా చిన్నారి ఆలోచిస్తుంటాడనుకుంటా. మనం నివసిస్తున్న సాంఘిక నిర్మాణాన్నీ, తన తండ్రిని ఏది చంపిందనే విషయాన్నీ అతడికి అర్థమయ్యేలా చేయడం నాకు పెద్ద ఛాలెంజ్.
ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై మా ఫొటోలను ఉపయోగిస్తున్న రామ్‌గోపాల్ వర్మపై ఫైట్ చేయడమనే కొత్త ఛాలెంజ్‌ను ఇప్పుడు చూస్తున్నాను. నా బిడ్డ ఫొటోను ఆయన ఉపయోగించినా నేను ఆశ్చర్యపోను.
క్యాస్ట్ ఫీలింగ్స్‌తో బతుకుతూ, నా జీవితం విషయంలో పక్షపాతంతో వ్యవహరిస్తుండే సాధారణ మనుషులు కేవలం అనాగరికులనీ, చదువుకోనివాళ్లనీ అర్థం చేసుకోడానికి నాకు చాలా సమయం పట్టింది. కానీ జీవితంలోని అనేక అంశాలపై, సమాజం ఆలోచనా ప్రక్రియపై ఉపన్యాసాలిచ్చే ఒక ఫిల్మ్ మేకర్.. ట్విట్టర్‌లో మా ఫొటోలను ఉపయోగించుకోడానికి, మా కథను చెప్పడానికి పర్మిషన్ అడగాలనే ఆలోచన చెయ్యకపోవడాన్ని నేనెప్పుడూ ఊహించలేదు.
ఆయన పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ నా ఇన్‌బాక్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక మెసేజ్‌లు ప్రవాహంలా వచ్చాయి. హత్యానంతరం ఆన్‌లైన్ వేధింపులతో నేను చాలా సఫర్ అయ్యాను. తమను పెళ్లి చేసుకొమ్మని జనం అడుగుతారు, నా లైంగిక జీవితం గురించి అడుగుతారు, నాకేమైనా ఎఫైర్ ఉందా అని అడుగుతారు, నన్ను చావమని అడుగుతారు.
ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ కారణంగా మరిన్ని వేధింపులను, సినిమా నిర్మాతలతో నేనేమైనా ఎఫైర్ పెట్టుకున్నానా అనే కొత్త ప్రాపగాండాని ఎదుర్కోబోతున్నాను. సొసైటీలో నా లాంటి పడుచు వితంతువు బాధ ఆయనకు తెలుస్తుందని అనుకుంటున్నాను.
తండ్రిని కోల్పోయిన నా చిన్నారి ఆలనాపాలనా చూసుకొనే బాధ్యతతో నార్మల్ లైఫ్ గడపడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఒక వ్యక్తిని, అతని భావనా ప్రక్రియను, నిర్ణయాలను తీర్చిదిద్దడంలో పేరెంటింగ్ అనేది జీవితంలోని అత్యంత ముఖ్యమైన అంశం. నా ఇంటి నుంచి బయటకు వచ్చి, నేను ప్రేమించిన వ్యక్తితో జీవించడం అనేది నేను ఎదుగుతూ వచ్చిన, నా నిర్ణయాల్ని తీర్చిదిద్దిన వాతావరణాన్ని చూపిస్తుంది.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు నా జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఫిల్మ్ పోస్టర్‌ను రిలీజ్ చేయడానికి రామ్‌గోపాల్ వర్మ పెట్టిన పోస్ట్‌ను చూసిన తర్వాత నుంచీ ప్రతి నిమిషం నేను వణికిపోతూ వస్తున్నాను. నా చిన్నారి జీవితాన్ని కాపాడుకోడానికి ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రయత్నిస్తుంటే, రామ్‌గోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ మరోసారి ఈ మొత్తం సమాజం కళ్లలోకి నన్ను లాగింది.
తన భర్త మర్డర్ జరిగిన రోజు నుంచీ ప్రతి రోజూ ఒక ఒంటరి తల్లి ఎలాంటి స్ట్రెస్‌ఫుల్ ఎమోషనల్ లైఫ్ గడుపుతూ ఉందనే కన్‌సర్న్ లేకుండా కచ్చితంగా మీరు చాలా పబ్లిసిటీ పొంది ఉంటారని తెలుసు. మీరు రిలీజ్ చేసిన పోస్టర్, నా జీవితానికి ఎక్కడా సంబంధం లేనిది. మా పేర్లను వాడుకోవడం ద్వారా మీరు అమ్మాలనుకుంటోంది ఒక ఫేక్ స్టోరీ. ఒక అందమైన జీవితాన్ని గడపాలనుకున్న నా కలలకు అన్యాయం జరిగినందువల్ల మేం పాపులర్ నేమ్స్ అయ్యాం. రెండు నిమిషాల పేరు కోసం మీ లాంటి జాతీయ స్థాయి పబ్లిక్ ఫిగర్ వాటిని వాడుకోవడం అనేది నేనెప్పుడూ ఊహించనిది.
నా చిన్నారికి నా కథను వెల్లడించిన రోజు, మీ ఫొటో కూడా అందులో భాగంగా ఉంటుంది.
ఒక స్త్రీని గౌరవించే విలువల్ని నేర్పే అమ్మ మీకు లేనందుకు మిస్టర్ రామ్‌గోపాల్ వర్మా.. మిమ్మల్ని చూసి జాలి పడుతున్నాను.
మీకు వ్యతిరేకంగా కేసు వేసి పోరాడటం ద్వారా మీకు పబ్లిసిటీ ఇవ్వాలని నేను అనుకోవడం లేదు. ఒక ఫేక్ ఫిల్మ్ మేకర్ పేరుతో ఉన్న మీరు ఈ స్వార్థపూరిత, హృదయంలేని, తిరకాసైన, క్రూరమైన సమాజంలో కేవలం ఒక భాగం. బాధ విషయంలో మీకంటే ఎక్కువ జీవితాన్ని నేను చూశాను. రెస్ట్ ఇన్ పీస్."

![]() |
![]() |