![]() |
![]() |

కరోనా ఎఫెక్ట్‌తో ఇండియన్ సినిమా ఓటీటీ బాట పట్టింది. భాషలతో సంబంధం లేకుండా దాదాపు ప్రతీ శుక్రవారం ఏదో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా.. ఈ ఓటీటీ రిలీజెస్‌లో ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే ‘అమృతరామమ్’ (తెలుగు), ‘పొన్‌మగళ్ వందాళ్’ (తమిళ్), ‘చోక్డ్’ (హిందీ), ‘పెంగ్విన్’ (మల్టీలింగ్వల్ మూవీ) విడుదల కాగా.. త్వరలోనే బాలీవుడ్ బయోపిక్ మూవీస్ ‘శకుంతలాదేవి’ (విద్యాబాలన్), ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ (జాన్వీ కపూర్) కూడా ఇదే బాటలో పయనించనున్నాయి. అలాగే మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘లా’ (కన్నడ) కూడా రిలీజ్ కాబోతోంది.
కాగా.. త్వరలోనే ఒకే సబ్జెక్టుతో నాలుగు వేర్వేరు భాషల్లో రూపొందిన ఫిమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనున్నాయని సమాచారం. ఆ చిత్రాలే.. బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ మూవీ ‘క్వీన్’ (2014) ఆధారంగా రూపొందిన ‘దటీజ్ మహాలక్ష్మి’ (తెలుగు), ‘పారిస్ పారిస్’ (తమిళ్), ‘జామ్ జామ్’ (మలయాళం), ‘బట్టర్ ఫ్లై’ (కన్నడ). కొన్నాళ్ళ క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాల విడుదలలో జాప్యం జరుగుతోంది. నాలుగు భాషల్లోనూ ఒకే రోజున విడుదల చేయాలన్న ఆలోచనతో ఆ చిత్రాల నిర్మాత మను కుమరన్ ఉన్నారు. అందుకే సరైన సమయం కోసం వేచిచూస్తున్నారు. అయితే.. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో నిర్మాత మను కుమరన్ ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఓ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ‘క్వీన్’ రీమేక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ రిలీజెస్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ‘క్వీన్’ తెలుగు వెర్షన్ ‘దటీజ్ మహాలక్ష్మి’లో తమన్నా కథానాయికగా నటించగా.. తమిళ్ వెర్షన్ ‘పారిస్ పారిస్’లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఇక మలయాళ వెర్షన్ ‘జామ్ జామ్’లో మంజిమా మోహన్ నాయికగా నటించగా.. కన్నడ వెర్షన్ ‘బట్టర్ ఫ్లై’లో పారుల్ యాదవ్ హీరోయిన్‌గా దర్శనమివ్వనుంది. మరి.. ఒరిజినల్ లాగే ఈ రీమేక్స్ కూడా ఎంటర్‌టైన్ చేస్తాయేమో చూడాలి.
![]() |
![]() |